జూరాల వద్ద పర్యాటకుల సందడి

గద్వాల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కృష్ణా పరివాహక ప్రాంతం మొదలయ్యే మహబలేశ్వరం నుంచి జూరాల వరకు కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి ప్రాజెక్టుగా ఉన్న జూరాల ఉమ్మడి జిల్లాలలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు జీవనాడి. జూరాలకు వరద మొదలైన జులై నుంచి ఆగస్టు 17 వరకు జూరాలకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు జలకళతో కనువిందు చేస్తోంది. దీంతో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శనకు వస్తున్నారు. చాలాకాలం తరవాత ప్రాజెక్ట్‌ నిండడంతో ప్రజలు తరలి వచ్చి తిలకిస్తున్నారు. నాలుగు రోజుల కింద మళ్లీ మొదలైన వరదతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటక ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి మరింత పెరిగింది. సాయంత్రానికి జలాశయానికి వరద చేరుతోంది. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు నీటి తోడిపోత కొనసాగుతోంది.నారాయణ్‌పూర్‌ జలాశయంలోకి 1.41 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం నుంచి 1.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద గణనీయంగా పెరిగిన క్రమంలో అధికారులు అప్రమత్తయ్యారు. క్రస్‌గేట్ల పర్యవేక్షణ కోసం ఎప్పటికప్పుడుఆపరేటింగ్‌ వ్యవస్థను పరిశీలిస్తున్నారు. వరద పెరిగినప్పుడు గేట్లు ఎత్తుతున్నామని అధికారులు తెలిపారు. జూరాల గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పర్యటకుల సందడి కనిపించింది. దిగువన ఉన్న పుష్కర ఘాట్ల వద్ద పర్యటకులు వరద నీటిలో విహారం చేస్తూ ఆహ్లాదకర వాతావారణాన్ని ఆస్వాదించారు.