జెఎన్‌టీయూలో విద్యార్థుల నిరసన

సెంటినరీకాలనీ: సెంటినరీకాలనీలోని జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలోవిద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పెద్దపెల్లిలోని తమ హాస్టల్‌లో భోజన సదుపాయం, నీటి వసతి సదుపాయాలు సరిగా లేవనీ దీనిపై ఇదివరకే రెండు సార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదంటూ శుక్రవారం భారీ ఎత్తున నిరసనకు దిగారు. కళాశాలలోని 500 మంది విద్యార్థులు జేఎన్‌టీయూ కాంపస్‌లో బైటాయించారు. సమస్యను పరిష్కరించేవరకు అన్నం ముట్టేది లేదని వారు భీష్మించుకొని కూర్చొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రలింగం వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. వీసీ వచ్చి హామీ ఇచ్చే వరకు కదలబోమన్నారు. దీంతో కాంపస్‌ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచే పంపించారు.