జైళ్ల ఆధునికీకరణకు చర్యలు
జైళ్లశాఖ డి.ఐ.జి. చంద్రశేఖరనాయుడు
శ్రీకాకుళం, జూలై 17 : జైళ్లలో ఖదైలకు అవసరమైన మేరకు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డి.ఐ.జి. ఎన్.చంద్రశేఖరనాయుడు తెలిపారు. నరసన్నపేట సబ్ జైళును తనిఖీ చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 22 కోట్లతో ఐదేళ్ల కాలవ్యవధిలో రాజమండ్రి, తనుకు జైళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నరసన్నపేటలో డబుల్‌గేట్ పద్దతిని ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా జైళు 170 మంది ఖైదీల సామర్ధ్యంతో నిర్మించారని, అయితే ఖైదీల సంఖ్య మించడంలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని విశాఖ కేంద్ర కారాగారం నుంచి 25 మంది శిక్షా ఖైదీలను ఇక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు జిల్లా జైళు అధికారి వి.జి.రామప్రసాద్, సబ్ జైలు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.