టచ్‌లోకొచ్చారు
మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్
విండీస్ విజయలక్ష్యం 312 పరుగులు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 5 (జనంసాక్షి) :
భారత బ్యాట్స్‌మన్ ఎట్టకేలకు టచ్‌లోకొచ్చారు. శుక్రవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియంలో నిర్వహించిన ముక్కోణపు సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇన్సింగ్స్‌తో భారత్‌కు ఈ ఫీట్ సాధ్యమైంది. మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకొని భారత్ నడ్డి విరువాలన్న ఆయన ప్రయత్నం నెరవేరలేదు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపికతో ఆడుతూ విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 23.1 ఓవర్లలో మొదటి వికెట్‌కు 123 పరుగులు చేసిన శర్మ, ధావన్ జోడిని కీమా రోచ్ విడదీశాడు. 77 బంతుల్లో 8 బౌండరీలు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసిన ధావన్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ బ్రేవో ఒడిసి పట్టుకున్నాడు. మొదటి వికెట్ పోవడంతో భారత స్కోర్ మందగించింది. 78 బంతుల్లో 46 పరుగులు చేసి అర్ధసెంచరీ దిశగా వెళ్తున్న శర్మను బెస్ట్ పెవిలియన్‌కు చేర్చాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రైనా వస్తూనే సిక్సర్ ఆశలు రేకెత్తించినా ఎక్కువసేపు నిలదొక్కుకోలేదు. 14 బంతుల్లో పది పరుగులు మాత్రమే చేసి శామ్యూల్స్ బౌలింగ్‌లో శ్యామీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దినేశ్‌కార్తీక్ కూడా రైనానే అనుసరించాడు. మురళీవిజయ్ కెప్టెన్ కోహ్లీకి తోడ్పాడునిచ్చాడు. మరోవైపు కోహ్లీ దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బంతిని బౌండరీ దాటించాడు. 39.5 ఓవర్లలో భారత స్కోర్ 210 పరుగుల వద్ద విజయ్ వికెట్‌ను కోల్పోయిన భారత్ చివరి పది ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టుకోగలిగింది. సహచరులు వెంట వెంటనే ఔటవుతున్నా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ 83 రెండు సిక్సర్లు, 13 బౌండరీలో 102 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 18 బంతుల్లో మూడు బౌండరీలతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 24 పరుగులు సమర్పించుకున్నారు. విండీస్ బౌలర్లలో బెస్ట్ రెండు, రోచ్, బ్రేవో, శామ్యూల్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
విండీస్ స్కోర్ 56/2 (10 ఓవర్లలో)
312 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఓపెనర్ క్రిస్ గేల్ కేవలం పది పరుగులకే భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ చార్లెస్ 25 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. బ్రేవో ఒకే ఒక్క పరుగు చేసి భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. వెస్టిండీస్ పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆట నిలిచిపోయే సమయానికి చార్లెస్ 33 పరుగులతో, శామ్యూల్స్ ఐదు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.