టర్కీలో ఆత్మాహుతి దాడి

5

– 50మంది మృతి

అంకారా,ఆగస్టు 21(జనంసాక్షి): టర్కీ మరోసారి బాంబుపేలుడుతో దద్దరిల్లింది. సిరియా సరిహద్దులకు సవిూపంలోని గజియంటెప్‌ సిటీలో ఓ వెళ్లి వేడుకపై శనివారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మంది మృతిచెందగా, 94 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులు హుటాహుటిన ఆసుసపత్రికి తరలించాయి. వెడ్డింగ్‌ పార్టీపై జరిగిన దాడిని గజియంటెప్‌ గవర్నర్‌ అలి యెర్లికయ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. దాడిని ఆయన ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదన్నారు.ఇది ఇస్లామిక్‌ ఉగ్రవాదుల పనా…కుర్దిష్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారా అనేది ఇంకా తెలియలేదని, ఆత్మాహుతి దాడికే ఎక్కువ అవకాశం ఉందని అధికార జస్టిస్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ పార్టీ (ఏకేపీ) నేత మెహ్మట్‌ ఎర్గోగన్‌ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఐఎస్‌ఐఎస్‌ దుశ్చర్యగా తెలుస్తోందని, దాడి జరిగిన ప్రాంతంలో కుర్దిష్‌ ప్రజలు ఎక్కువ మంది నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకే ఈ దాడి జరిగిందని, ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదని డిప్యూటీ ప్రధాని మెహ్మట్‌ సిమ్సెక్‌ స్పష్టం చేశారు. సిటీలో మరికొన్ని చోట్ల కూడా బాంబు పేలుళ్ల శబ్దం వినిపించినట్టు వార్తలు వెలువడ్డాయి.