-టిఆర్ఎస్ అంతు చూస్తాం -ఉద్యోగులు, నిరుద్యోగులకు అండగా నిలుస్తాం.

-వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం.
-కెసిఆర్ దుర్మార్గపు పాలనకు వీఆర్ఏలు బలి.
-టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మోపతయ్య.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14 (జనంసాక్షి):
నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు నష్టం చేకూరుతుందని ఉద్దేశంతో దశాబ్దాల పాటు పోరాటం సాగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అచ్చంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య తెలిపారు.అయితే బంగారు తెలంగాణ అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యల గడ్డగా తెలంగాణను మార్చడం జరిగిందని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఉద్యోగ కల్పన చేయకుండా ఈ ప్రాంత యువత ఉసురుతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిన నేపథ్యంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకున్నారని మోపతయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని యావత్ తెలంగాణ ప్రజలు ఆశించారని తెలిపారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపుతానని మాయమాటలు చెప్పడం తప్ప తెలంగాణ ప్రజల బతుకులు ఇసుమంతైన మార్పు లేదని పేర్కొన్నారు.వీఆర్ఏలను తన కళ్ళల్లో పెట్టి చూసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా గొప్పలు పలికిన కేసీఆర్ వీఆర్ఏలు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు.వీఆర్ఏల ఉద్యమానికి టిడిపి పార్టీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ఉంటుందని మోపతయ్య తెలిపారు. వీఆర్ఏలకు కెసిఆర్ అసెంబ్లీలో చెప్పిన మాదిరిగా పే స్కేల్ ఇవ్వాలని వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వారి అనంతరం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల హక్కులకు కేసీఆర్ ప్రభుత్వం భంగం కలిగించాలని చూస్తే టిడిపి చూస్తూ ఊరుకోదని మోపతయ్య హెచ్చరించారు. వీఆర్ఏల హక్కుల పరిరక్షణ, వారి ఉద్యోగం భద్రత కోసం టిడిపి ముందుండి పోరాడుతుందని భరోసా కల్పించారు. వీఆర్ఏలు గత ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలుపుతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజనం ఖర్చుల్లో భాగంగా 3 వేల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులోను వీఆర్ఏలకు అండగా ఉంటానని తెలంగాణ ప్రజల పక్షాన అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి బిడ్డకు అండగా తాను ఉంటూ ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధి అని అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సకల జనులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, ఫయాజ్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు.