టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ఇంటిబాట తప్పదు

ఉత్తుత్తి హావిూలను ప్రజలు తిప్పికొడతారు

మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌తో పాటు జిల్లాలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి పాగా వేస్తుందని మాజీ మంత్రి, ప్రస్తుత మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధార్‌ భాబు ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌, బిజెపిలకు కాలం చెల్లిందన్నారు. ప్రజలు ఇంకా సెంటిమెంట్‌ను నమ్మడానికి వెర్రిబాగులవారు కాదన్నారు. గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని, దానినే తాము సాధించిన ఘనతగా తెరాస నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. డిసెంబరు 11 తర్వాత ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబం అబద్ధాలతో రాష్ట్రాన్ని ఏలుతోందన్నారు. భూకుంభకోణాలు, నయీం

వ్యవహారాలపై ఆరోపణలు వచ్చినా కేసీఆర్‌ చర్యలు తీసుకోలేదన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోలేదని, డీలర్లపైనే మొక్కుబడిగా చర్యలు తీసుకోని చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ఇకపోతే బిజెపి మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మోడీ, అమిత్‌షౄలు ఎంతగా ప్రచారం చేసినా రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదన్నారు. బిజెపి నేతలు మూటాముల్లె సర్దుకున్న తరవాతనే పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చిందని మరోమారు ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం బిజెపి నేతలకు ముందే తెలుసన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలల కిందటే లీక్‌ చేయడంతో బిజెపి నేతలంతా సర్దుకున్నారని, నల్లధనంతో ఆస్తులు కొనుగోలు చేసుకున్నారని ఆరోపించారు. తద్వారా ఆ పార్టీ నేతలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. ఈ చర్యతోనే ఎవరు నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుంద న్నారు. నోట్ల రద్దు పరిణామాలను అంచనా వేయడంలో ప్రధాని విఫల మయ్యారన్నారు. సామాన్యుల కష్టాలు పట్టించుకోకుండా కేవలం పేరు కోసం నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయంతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. కరీంనగర్‌ను డల్లాస్‌ చేస్తామన్న హావిూఏమయ్యిందన్నారు. ప్రజలు అడగడం లేదని అనుకోవద్దని, తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపుతారని అన్నారు. జిల్లాలో రోడ్లపై ప్రజలు జోకులు వేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ జిల్లా ప్రజలకు ఇచ్చిన పలు హామిలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు ప్రకటించిన వైద్య కళాశాల ఏమైందని, శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉప కులపతిని ఎందుకు నియమించలేదు, ప్రభుత్వాసుపత్రిని ఎందుకు ఆధునీకరించలేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం వేసిన శిలాఫలకం ఏమైందని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాద బాధితులను సీఎం ఎందుకు పరామర్శించ లేదో జవాబు ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి గెలిచి తీరుతుందని, కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు, కరీంనగర్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీకి వెళ్లక తప్పదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు.