టిఆర్ఎస్లో అధికార బదలాయింపు
ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ వారసత్వం అన్నది సర్వసాధారణం.. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలనే నమ్మకుంది. దేశంలో అనేక పార్టీలు వారసత్వ రాజకీయాలను ఊతంగా చేసుకుని నడుస్తున్నాయి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. తమిళనాడులో డిఎంకె, ఎపిలో తెలుగుదేశం,మహారాష్ట్రలో శివసేన వంటి పార్టీలు ఇవే పునాదులపై నడుస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే రీతిలో పార్టీ పయనిస్తోంది. రాన్నుది ఎన్నికల కాలం.తొలుత పంచాయితీ ఎన్నికలు, సహకార ఎన్నికలు ఉన్నాయి. ఆ తరవాత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. వీటన్నింటిని సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించాల్సి ఉంది. ఈ సమయంలో సమర్ధంగా వీటిని ముందుకు తీసుకుని వెళ్లగల యువనాయకుడు టిఆర్ఎస్కు అసవరం. అది తన తనయుడు అయితే మంచిదన్న భావనలో కెసిఆర్ ఉన్నారు. నిజానికి టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ అయినా దాని అధినేత కెసిఆర్ జాగ్రత్తగా ఉద్యమకారులను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. అంతా తానై నడిపిస్తున్నారు. తొలినాళ్లలో మేనల్లుడు హరీష్ రావు కుడిభుజంగా ఉన్నా, తదనంతర కాలంలో కెటిఆర్, కవితల రాకతో మెల్లగా వారికి ప్రాధాన్యం పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తరవాత తనయుడు తారకరామారావును టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత కెసిఆర్ నియమించారు. ఇందులో ఆశ్చర్యపడడానికి లేదా అనుమానపడడానికి పెద్దగా అవకాశాలు లేవు. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించి, తన తరవాత కెటిఆర్ అన్న సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వంలో అంతా కెటిఆర్ అని నిరూపించారు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించారు. అఖండ విజయం సాధించిన తరవాత పార్టీ పగ్గాలు కూడా అప్పగిం చడం ద్వారా అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కీలకం తారక రామారావు అన్న స్పష్టత ఇచ్చారు. పార్టీలో ఉన్నవారికి అనుమానాలు రాకుండా ముందస్తు వ్యూహం ప్రకారమే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కాకున్నా రేపయినా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. అదేదో ముందే తీసుకోవడం ఓ రకంగా మంచిదని భావించి ఉంటారు. దీంతో కెసిఆర్ అందుబాటులో ఉండడం లేదన్న అపవాదు లేకుండా అంతా కెటిఆర్ చూసుకుంటారన్న సందేశం కూడా ఇచ్చారు. ఇకముందు పార్టీలో, ప్రభుత్వంలో కూడా కెటిఆర్ చూసుకుంటారు. పేరుకు కెసిఆర్ అధినేత అయినా అన్నింటికి కెటిఆర్ ముందుంటారు. మొత్తంగా
తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత పార్టీని, ప్రభుత్వాన్ని తనయునికి కట్టబెట్టే ప్రయత్నాలను కెసిఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు కెసిఆర్‌పై విశ్వాసంతో రెండోవిడుత అధికారం అప్పగించిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా,పార్టీ పరంగా కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. జాతీయ రాజీకాలపై ఆసక్తి పెంచుకున్న కెసిఆర్ అధికార బదలాంపు చేస్తే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం అవుతోంది. ప్రజలకు ఇచ్చిన హావిూల మేరకు అత్యంత కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యతలు కేసీఆర్‌పై ఉన్నాయి. మరోవైపు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకుని రావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల తరచూ ఢిల్లీ సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటితో రాష్ట్రంపై పెద్దగా దృష్టి సారించడం కుదరదు. అందుకే తన బాధ్యతలను తనయుడికి అప్పగిస్తే తాను కూడా సేఫ్‌గా ఇతర కార్యక్రమాలు చూసుకునే వీలుంటుంది. అయితే హరీష్ రావుకే ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదనే వాదనలు కొందరు లేవనెత్తడం సహజం.
తనయుడిపై ఉన్న మమకారం అల్లుడిపై ఉంటుందా అన్నది ముఖ్యం. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అల్లుడు చంద్రబాబును దగ్గరకు చేర్చుకున్నారు. తన తరవాత బాధ్యతలను బాబుకు అప్పగించారు. అయితే ఆ తరవాత ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. కెసిఆర్‌కు సమర్థుడైన కుమారుడు ఉన్నందున ఇక పార్టీని, ప్రభుత్వాన్ని కుమారుడికి అప్పగించడమే మేలని భావించారు. సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించే శాఖల విషయంలోనే కాకుండా.. పార్టీ పరంగా కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో తన సత్తా చాటుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలతోపాటు.. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల సందర్బంగా పార్టీలో పలుచోట్ల టిక్కెట్లపై గొడవలు జరిగాయి. అసంతృప్తులు గళం విప్పారు. అయితే వాటిని నేర్పుగా పరిష్కరించి, విభేదాలు బయటకు రాకుండా పరిష్కరించారు. తన నియామక ప్రకటన వెలువడిన తర్వాత టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, తన సహచర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కేటీఆర్ వారి నివాసాలకు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వినమ్రతను చాటుకున్నారు. పార్టీ సీనియర్లు కూడా కేటీఆర్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో పాటు, కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను, బిజెపిని, తెలంగాణ జనసమితిని చావుదెబ్బ కొట్టాక ఇక పార్టీని మరింత పటిష్టం చేయాల్సి ఉంది. అందుకే యువకుడైన కొడుక్కి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకంగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడమే గాకుండా తన లక్ష్యాల మేరకు పనిచేస్తాడు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పనిభారం తగ్గించుకోవడం కూడా ముఖ్యం. ఇప్పటివరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అందుకే వెంటనే ఈ అధికార బదలాయింపునకు నిర్ణయించారని భావించాలి.