టిఆర్‌ఎస్ అభ్యర్థులకు తప్పని ఎదురీత
జగిత్యాల,అక్టోబర్29(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ నేతలకు ఎదురీత తప్పడం లేదు. అక్కడక్కడా నిలదీస్తున్నారు. తమ గ్రామానికేం చేశారని నిగ్గదీస్తున్నారు. హావిూలపై పట్టుబడుతున్నారు. ప్రధానంగా టిఆర్‌ఎస్ అభ్యర్థులకు సమాధానం చెప్పుకోవడం భారంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ సమస్యలపై నిలదీసారు. ప్రచారంలో ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్, సతీష్ కుమార్‌లను నిలదీయగా తాజాగా భాగంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటలో ప్రచారం చేస్తున్నధర్మపురి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల గతంలో సాగు నీరు విషయంలో ఇచ్చిన హావిూ నెరవేర్చలేదని గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ నుంచి ఉపకాలువ ద్వారా చెరువుకు నీరు తీసుకొచ్చిన తర్వాతనే గ్రామంలో అడుగుపెడతానని చెప్పి ఇప్పుడెలా వచ్చారని నిలదీశారు. ఈశ్వర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువ నిర్మాణానికి 1.91 కోట్లతో ప్రతిపాదన లు పంపామని, మంజూరు కూడా అయిందని ఎన్నికల కారణంగా పూర్తి చేయలేక పోయామని ఈశ్వర్ తెలిపారు. ఎన్నికల తరవాత గ్రామాల్లో సమస్యలు తీరుతాయన్నారు.