టిఆర్‌ఎస్‌ ఓటమితోనే ప్రజలకు సంక్షేమం: మక్కన్‌ సింగ్‌

పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెరాసను ఓడించి కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ మక్కన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ అభివృద్ది పేరుతో టిఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ను ఓడించాలనే సంకల్పంతో మహాకూటమి ఏర్పడిందని తెలిపారు. చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో తెరాస ప్రజలను మోసం చేసిందని ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను తెరాస నాలుగున్నరేళ్లు పాలించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను ఎన్నికల్లో ఓట్లతోనే బుద్ధి చెప్పాలని తెలిపారు. ఉన్న వనరులంతా దోచుకున్నారని, మొక్కలు నాటడం మొదలుకుని వాటిని సంరక్షించడం వరకు అన్ని ముడుపుల వ్యవహారంగానే సాగిందన్నారు. నియోజకవర్గంలో నాటిన మొక్కలు, సంరక్షించిన చెట్లు ఎవరికైనా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల వాగ్ధానాలన్నీ పక్కన పెట్టి మళ్లీ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. తెరాస పాలనలో ప్రజలు విసిగిపోయారని, తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని, ఇలాంటి తరుణంలో వారిని ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.