టిఆర్‌ఎస్‌ నుంచి ప్రతిస్పందన శూన్యం

బిజెపికి చేరువవుతున్న బోడిగె శోభ

కరీంనగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టిఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. తనకు టిక్కెట్‌ కేటాయించకుండా కాలయాపన చేయడంపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసంది. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఆమెకు ఈ సారి టికెట్‌ ఇచ్చే పరిస్థితులు కనపడటం లేదు. తనకు టికెట్‌ కేటాయించాలని ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె కోరినా…కెసిఆర్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో, టిఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలుస్తోంది. బిజెపి తరపున ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తన అనుచరులతో ఆమె సమావేశమై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బిజెపిలో చేరడాన్ని కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా, ఎక్కువ మంది ఆమె నిర్ణయానికి మద్దతు పలికారు. ఆమె తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అవసరమైతే బిజెపి నుంచి పోటీలోకి దిగుతానని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే బిజెపి కూడా ఆమెకు టిక్కెట్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న తనను నిర్లక్ష్యం చేయడంపై ఆమె మండిపడతున్నారు.