టిఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు

ఖమ్మం,ఏప్రిల్‌15:  తెరాస 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న ఖమ్మంలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, మంత్రులు  రానున్నందున పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాతట్లు కూడా చేస్తున్నారు.  ఖమ్మం సవిూపంలోని చెరుకూరి మామిడి తోట సవిూపంలో పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ జరుగుతుందని, మామిడి తోటలో ప్రతినిధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడన్‌బేగ్‌ తెలిపారు. అదే రోజు సాయంత్రం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో పార్టీ బహిరంగ సభ జరిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి తొలిసారిగా ఖమ్మం తరలివస్తున్న పార్టీ నేతలందరికీ తెలంగాణ వంటకాలతోపాటు ఆంధ్ర వంటకాలను రుచి చూపిస్తామన్నారు. ఒక రోజు ముందుగా ఖమ్మం వచ్చే ప్రతినిధులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలిసారిగా ఖమ్మంలో తెరాస ప్లీనరీ, బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయించినందుకు పార్టీ అధినేత కేసీఆర్‌, మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎక్కడా జరగని రీతిలో పార్టీ ప్లీనరీ, బహిరంగ సభను జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.ప్లీనరీ, బహిరంగ ఏర్పాట్లకు పార్టీ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. మంత్రి తుమ్మల

నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షునిగా వ్యవహరించే ఈ కమిటీకి అధ్యక్షునిగా బుడన్‌బేగ్‌, సభ్యులుగా ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్‌, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌, జడ్పీ అధ్యక్షురాలు కవిత, డీసీసీబీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎగ్గడి అంజయ్య, కొండబాల కోటేశ్వరరావు, యూనిస్‌ సుల్తాన్‌, పోట్ల నాగేశ్వరరావు, మేయర్‌ పాపాలాల్‌, తాళ్లూరి వెంకటేశ్వరరావు ఉంటారని తెలిపారు. మరో 8 సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సతుల కమిటీ కన్వీనర్‌గా బాలసాని లక్ష్మీనారాయణ, భోజన కమిటీకి మువ్వా విజయ్‌బాబు, ప్లీనరీ, బహిరంగ సభ వేదిక ఏర్పాటు కమిటీకి తాటి వెంకటేశ్వర్లు, వలంటీర్ల కమిటీకి నల్లమల వెంకటేశ్వరరావు, ప్రచార కమిటీకి బీరెడ్డి నాగచంద్రారెడ్డి, విూడియా కమిటీకి ఆర్జేసీ కృష్ణ, మహిళా ప్రతినిధుల కమిటీకి గడిపల్లి కవిత, అలంకరణ కమిటీకి డాక్టర్‌ పాపాలాల్‌ను కన్వీనర్లుగా నియమించారు.