టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌

– విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్‌ కావాలా.. ఎంఐఎం మేయర్‌ కావాలో హైదరాబాద్‌ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్‌ మేయర్‌ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌, హరీష్‌, కేసీఆర్‌ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్‌ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు.ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన జవదేకర్‌ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘కేసీఆర్‌ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా. హైద్రాబాద్‌ను డల్లాస్‌ నగరం చేస్తామని.. కేటీఆర్‌ వరదల నగరంగా మార్చారు. లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్‌ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదు. హుస్సేస్‌ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్‌ తాగుతున్నారా?. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్‌ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్‌ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏమైందో అందరకీ తెలుసు’అని అన్నారు.