టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో..  అబద్దాల పుట్ట


– మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి?
– టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మందకృష్ణ, ఆర్‌.కృష్ణయ్యలు తనతో కలిసిరావాలి
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. గతంలో ఇచ్చిన హావిూలను నాలుగేళ్లలో ఒక్కటికూడా పూర్తిచేయని కేసీఆర్‌.. ఇప్పుడు కొత్త వాగ్ధానాలతో ప్రజలను మోసంచేసేందుకు బయల్దేరారని విమర్శించారు. మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయని రాములు నాయక్‌ ప్రశ్నించారు. గిరిజనులంటే కేసీఆర్‌కు చులకనభావం అని, కేవలం ఓట్లకోసమే గిరిజనుల కేసీఆర్‌ వాడుకుంటున్నారని అన్నారు. గిరిజనులంతా ఏకతాటిపైకి రావాలని, కేసీఆర్‌కి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన స్పష్టం చేశారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో బొంద పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా అహంకారంతో సస్పెండ్‌ చేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు 25 నుండి 30సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు. తనకు ఏటికెట్‌ అవసరంలేదు, తాను ఎన్నికల్లో పోటీ చేయనని రాములు స్పష్టం చేశారు. తనకు కావాల్సింది గిరిజనుల రిజర్వేషన్లని, దానికోసం పోరాడతానని తెలిపారు. పది ప్రభుత్వాలను చూసిన జైపాల్‌ రెడ్డిని విమర్శించే అర్హత స్థాయి టీఆర్‌ఎస్‌ నేతలకు లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను స్విచ్‌ఆఫ్‌ చేసేందుకు తనతో చేతులు కలపాలని మందకృష్ణ, ఆర్‌.కృష్ణయ్యకు పిలుపునిచ్చారు. నారాయణఖేడ్‌లో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, భూపాల్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చెయ్యాలని సవాల్‌ విసిరారు. తాను ఓడిపోతే ఉరేసుకుంటానని రాముల్‌నాయక్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఓటమికి అందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.