కన్నవారిని పట్టించుకోకపోతే ఇకపై ఆర్నెళ్లు జైలు

 – శిక్ష పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి) : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం లేదా వారిని వేధింపులకు గురిచేసే వారికి విధించే శిక్షను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అలాంటి వారికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తుండగా.. దాన్ని ఆరు నెలలకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు సీనియర్‌ అధికారి ఒకరు వివరాలను వెల్లడించారు. దీంతో పాటు తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం 2007లో ఉన్న ‘సంతానం (చిల్డన్ర్‌)’ అనే పదానికి అర్థాన్ని కూడా మరింత విస్తృతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం సంతానం అంటే సొంత పిల్లలు, సొంత మనవళ్లు, మనవరాళ్లు మాత్రమే వస్తారు. తాజాగా దత్తత తీసుకున్న లేదా సవతి పిల్లలు, కోడళ్లు, అల్లుళ్లు, లీగల్‌ గార్డియన్స్‌గా వ్యవహరిస్తున్న మైనర్లను కూడా సంతానం కిందకు తీసుకురావాలని ఇటీవల కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు మరిన్ని మార్పులు కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రుల నెలవారీ అవసరాల కోసం నిర్వహణ ఖర్చుల కింద వారి పిల్లలు కొంత మొత్తాన్ని ఇచ్చేలా డ్రాఫ్ట్‌ తీసుకురానుంది. అయితే ఇది అందరికీ ఒకేలా కాకుండా.. వారి వారి ఆదాయాలను బట్టి మారేలా నిబంధనలు రూపొందించనుంది.