టీమిండియాకు కొత్తజోడి
ధావన్ సక్సెస్ – సెహ్వాగ్
గంభీర్‌కు ఔట్
హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి) :
టీమిండియాకు ఓపెనింగ్ జోడి సమస్య తీరనుంది. గౌతం గంభీర్, వీరెంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు బాగానే ఆడుతూ వచ్చింది. కొంతకాలం మాస్టర్ సచిన్ కూడా మంచి ఓపెనర్‌గా పేరుపొందాడు. గౌతం గంభీర్, వీరెంద్ర సెహ్వాగ్ వరుస వైఫల్యాలతో వారిని తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఇండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తలెత్తింది. మురళీ విజయ్‌తో ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఖర్ ధావన్‌కు సరైన జోడీ కనిపించకుండా పోయింది. ఈ స్థితిలో కెప్టెన్ ధోని రోహిత్ శర్మను కీలకమైన సమయంలో ముందుకు తెచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్‌తో రోహిత్ శర్మను జత కలిపాడు. దక్షిణాఫ్రికపై జరిగిన మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ హిట్టయ్యింది. వారి సెంచరీ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికపై తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 300కు పైగా స్కోర్ చేసింది. ఆ రకంగా దక్షిణాఫ్రికాకు భారీ స్కోరు సవాల్ విసిరింది. ఆ తర్వాత వెస్టిండీస్ మీద మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ రాణించింది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ, ధావన్ సెంచరీ చేశాడు. వెస్టిండీస్ తమకు నిర్ధేశించిన లక్ష్యం భారీగా లేకపోవడంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నింపాదిగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. ఆ రకంగా వారు మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జోపెనింగ్ జోడీ తర్వాతే వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గించడంలో విజయం సాధించారు. నిజానికి రోహిత్ శర్మ అంతకు ముందటి రికార్డ్ బాగాలేదు. అయినా నమ్మకం ఉంచి రోహిత్ శర్మను ఓపెనర్‌గా పంపారు. ధోని నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఆల్ రౌండర్‌గా అదరగొడుతున్నాడు. ఇటీవల కాలంలో బౌలరుగా ఇండియాకు కీలకమైన సమయంలో వికెట్లు కూల్చి ఆదుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు అతను అత్యంత పరుగులు సాధించి విజయాన్ని అందించిన సందర్భలున్నాయి. బౌలింగ్ విభాగంలో యువకులు ఉమేశ్, భువనేశ్వర్, జహీర్‌ఖాన్ లేని లోటును సమర్థంగానే పూరించారని చెప్పవచ్చు. వీరెంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ వంటి ఆటగాళ్లు లేని సమయంలో ఇండియా యువ కిశోరాలతో ముందుకు సాగడానికి అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ స్థితిలో గౌతం గంభీర్, సెహ్వాగ్‌వంటి సీనియర్లు తిరిగి వన్డేల్లోకి రావడం కష్టమే మరి..