టీమిండియా సమర కౌశలం

సత్తా ఉన్న టీమ్‌గా రాణించిన వైనం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేసుకుంటేనే గెలుపు సాధ్యం అవుతుంది. క్రీడల్లో అయితే ఇది అవసరం. ఎదుటి పక్షం బలాన్ని బలహీనతలను అంచనా వేసి సాగడం వల్ల టీమిండియా భారీ విజయాన్ని నమోదుచేసి, ప్రపంచకప్ప్‌ పోరులో ఆశలను సజీవం చేసుకుంది. పాక్‌తో గెలుపు తరవాత సఫారీలపై గెలుపు ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆదివారం నాటి మ్యాచ్‌ గెలచి ఉండకపోతే దాని ప్రభావం ఇతర మ్యాచ్‌లపై బాగా పడేది. కానీ సమిష్టి పోరుతో పాటు బ్యాటింగ్‌,బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో రాణించడం వల్ల సఫారీలను మట్టి కరిపించి ప్రపంచ కప్‌ పోటీల్‌ఓ భారత్‌ పటిష్టంగా ఉందన్న సంకేతాలను ఇచ్చింది. నిన్న మొన్నటి వరకూ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న భారత టీమ్‌ జూలు విదిల్చి,  రెండు ఆదివారాల్లో జరిగిన మ్యాచ్‌లను గెలిచి అభిమానులకు కూడా ఆశలు రేకెత్తించారు. ఏ  దేశంతో మ్యాచ్‌ గెలిచినా భారత క్రికెట్‌ ప్రేమికులకు అంత కిక్‌ రాదు. కానీ  పాకిస్థాన్‌ తో మ్యాచ్‌ అంటే చాలా అంతా ఎక్కడ లేని ఉత్కంఠ. సంవత్సరాలుగా ఇదే వరస. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ప్రపంచ కప్‌ లో ఎప్పుడూ భారత్‌ ను ఓడించిన చరిత్ర లేని పాక్‌ ఆ చరిత్రను అలాగే నిలబెట్టుకుంది. ఫలితం భారత టీమ్‌ రికార్డు  విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు సౌతాఫ్రికాపైనా విజయం సాధించి చరిత్రను తిరగరాసి ఆశలను పదిలం చేసింది.  అద్భుతమైన విజయాన్ని సాధించిన భారత టీమ్‌ కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు  చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌ రావులు అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్‌ గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో ధోనీసేన ఆల్‌ రౌండ్‌ షోతో చెలరేగి 130  పరుగులతో సఫారీలపై ఘనవిజయం సాధించింది. ఆమ్లా, డికాక్‌, డుప్లెసిస్‌, డివిల్లీర్స్‌, మిల్లర్‌, డుమిని… ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే దుర్భేద్యంగా ఉంది. అందరూ ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించే సత్తా ఉన్న మొనగాళ్లే! నిలకడలేని మన బౌలింగ్‌ విభాగమేమో ఆందోళన కలిగించేలా ఉంది. మనకు బ్యాటింగ్‌ బలంఉన్నా బౌలింగ్‌లో ముందు నుంచీ పేలవంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో 308 పరుగుల లక్ష్యం సరిపోతుందా..! మరో 20-30 రన్స్‌ చేసుంటే బాగుండేది అన్న చర్చ వచ్చింది. రెహానా అవుటవ్వడం, రైనా, ధోనీ ఇలా అందరూ అవుటవ్వడంతో స్కోరు మందగించింది. లేకుంటా మరో 20 లేద 30 పరుగులు వచ్చి ఉండేవన్న భావన వచ్చింది. అప్పుడే సఫారీలకు కొంచెం కష్టంగా ఉండేదని భావించారు. 307 పరుగుల లక్ష్యాన్నీ సౌతాఫ్రిక అవలీలగా చేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించడంతో వారిని పరుగుల లక్ష్యంలో క్రీజ్‌ దాటకుండా చేశారు. అత్యుత్తమ లైన్‌పను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. సమవుజ్జీల సమరాన్ని కాస్తా ఏకపక్షం చేసేశారు. రెండు దశాబ్దాలుగా ఉన్న చెత్త రికార్డును తిరగరాశారు. తద్వారా భారత్‌ క్వార్టర్స్‌ అవకాశాలు మెరుగవడంతోపాటు గ్రూప్‌-బిలో అగ్రస్థానానికి కూడా మార్గం సుగమమైంది! ఇదే ఇప్పుడు ప్రపంచకప్‌ అశలను సజీవంగా నిలిపింది. వరల్డ్‌క్‌పల్లో దక్షిణాఫ్రికాపై తొలి విజయాన్ని అందుకుని 1992, 1999, 2011లో ఎదురైన పరాభవాలకు బదులు తీర్చుకుంది. ధోనీసేన నిర్దేశించిన 308 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దుర్భేద్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 రన్స్‌కే చేతులెత్తేశారు.  ధవన్‌, కోహ్లీ రెండో వికెట్‌కు 127 పరుగులు జోడించడంతో భారత్‌ పటిష్టస్థితిలోకి రాగలిగింది. ఇక ధవన్‌ సెంచరీ చేసిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ నెగ్గడం విశేషం. అలాగే వరల్డ్‌క్‌పల్లో దక్షిణాఫ్రికాపై ఓ బ్యాట్స్‌మన్‌ ఇన్ని పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. మరోవైపు రహానె కూడా ధాటిగా ఆడడంతో భారీ స్కోర్‌ నమోదయ్యింది. ఇప్పుడు మిగతా టీమ్‌లతో పోలిసత్‌ఏ భారత్‌ కూడా పటిష్టంగానే ఉందన్న భావన ఇతర జట్లకు తెలిసి వచ్చింది.