టీయూను సందర్శించిన చాన్స్ లర్ (గవర్నర్)

విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి మొదటి సారి ..
నిజామాబాద్ బ్యూరో,ఆగస్టు 7(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ (చాన్స్ లర్) డా. తమిళి సై సౌందర రాజన్  తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు.
మొదట పరిపాలనా భవనానికి విచ్చేసిన గవర్నర్ కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, అదనపు కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ స్వాగతం పలికి ఆహ్వానించారు.
జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెరేడ్ లో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ చేత గౌరవ వందనం స్వీకరించారు.
అదే విధంగా పోలిస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా నిర్వహించిన పెరేడ్ లో పోలీస్ సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించారు.
వీసీ చాంబర్ ను సందర్శించిన గవర్నర్ ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, పాలక మండలి సభ్యులు డా. మారయ్య గౌడ్, గంగాధర్ గౌడ్, బి ఎల్ ఎన్ శాస్త్రి, ప్రొ. నసీం, డా. రవీందర్ రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.
తర్వాత కంప్యూటర్ సైన్స్  కళాశాలలో ఏర్పాటు చేయబడిన సమావేశంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులతో సంభాషించారు.
మొదట ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి సాధించిన అభివృద్ధిని తెలియజేశారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ లో సాధించిన ప్రగతిని పేర్కొన్నారు. కోర్సుల వివరాలు, సిలబస్ లో పొందుపరిచిన పాఠ్య ప్రణాళికలను తెలియజేశారు. పరిశోధనా సామర్థ్యాన్ని వివరించారు. సదస్సులు, కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్ లు, ప్రాజెక్ట్ ల నిర్వహణలను వెల్లడించారు. బోధనంలోను, పరిశోధనల్లోను అధ్యాపకులు, పరిశోధకులు కనబరిచిన ఉత్తమ ప్రతిభను వివరించారు. దేశ విదేశాలలో ఉన్నత విద్యా పరిశోధనల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన వారి వివరాలను ప్రస్తావించారు.
తర్వాత శివ, సంతోష్, విగ్నేష్, జ్యోత్స్నా రాణి, రవి, నవీన్ కుమార్, డా. నందిని తదితర విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులతో గవర్నర్ సంభాషించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ… విశ్వవిద్యాలయాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం తక్షణమే 200 కోట్లు విడుదల చేయాలని అన్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 50 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కొత్త కోర్సుల కల్పన కోసం విద్యాశాఖకు సిఫారసు చేయాలని అన్నారు. మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగపూర్ క్యాంపస్ కళాశాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సదస్సులు, కాన్ఫరెన్స్ లు, సాంస్కృతిక కార్యకలాపాల కోసం ఆడిటోరియం నిర్మాణం చేయాలని అడిగారు. న్యాయ కళాశాలలోని కోర్సులకు ప్రాక్టికల్ నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలని అన్నారు. న్యాయ విద్యార్థులు హైకోర్టు, సుప్రీంకోర్టులను సందర్శించడానికి అవకాశం కల్పించాలని అన్నారు. విజ్ఞాన సౌధ (గ్రంథాలయం) లో మంచి రిఫరెన్స్, ఆధార, పరిశోధక, పాఠ్య గ్రంథాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇ – లైబ్రెరీని ఏర్పాటు చేయాలని కోరారు. స్పోర్ట్స్ & గేంస్ కు సంబంధించిన మైదాన ప్రాంతాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ఇండోర్, ఔట్ డోర్ క్రీడల కోసం ఆడిటోరియాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్పోర్ట్ బోర్డ్ కోసం నిధులు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. క్రీడలకు సంబంధించిన వివిధ ఆటల సామగ్రిని అందించాలని అన్నారు. ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్, ఇతర మెడికల్ సిబ్బంది, అంబూలెన్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాల భర్తీకి పూనుకోవాలని అన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టల్ కావాలని కోరారు. హాస్టల్స్ లో నెలకొని ఉన్న సమస్యల పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు, పరిశోధకులకు ప్లేస్ మెంట్స్ (ఉద్యోగాలు) దొరికే విధంగా సహకరించాలని కోరారు. స్నాతకోత్సవం (కాన్వకేషన్) ఏర్పాటు చేసి డిగ్రీ, డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయాలని అన్నారు. అలాగే స్వాగత, వార్షికోత్సవాలను నిర్వహించాలని అన్నారు. యూనివర్సిటీలో ఇంటర్ నెట్ వై ఫై ని కనెక్ట్ చేయించాలని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్. డి. పరిశోధన కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. పరిశోధకులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలని అన్నారు. ఇంకా తదితర అంశాలపై గవర్నర్ గారితో సంభాషించారు.
తర్వాత గవర్నర్ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రారంభం అయినప్పటి నుంచి నేటి వరకు గవర్నర్ గా తానే మొదటి సారిగా తెలంగాణ యూనివర్సిటీ సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జాతీయ స్థాయిలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అకడమిక్, పరిశోధనా రంగంలో టాప్ ర్యాంక్ లో నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం, ఉత్తమమైన పరిశోధనల కోసం, నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నం చేయాలని అన్నారు. నేషనల్ న్యాక్ – ఎ అగ్రిడియేషన్ సాధన కోసం ప్రపోజల్స్ సమర్పించి, కృషి చేయాలని అన్నారు. తాను స్వయంగా విద్యార్థులతో అనుబంధం పెరగడం కోసం “కనెక్ట్ చాన్సలర్ ఆలుమ్నై” (పూర్వ విద్యార్థుల సమ్మేళనం) అనే విభాగం ద్వారా చేరువ కావడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. విద్యార్థులు కోరిన సదుపాయాలను సమకూర్చడం కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, గవర్నర్ కార్యాలయాల సెక్రటరీ కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవాని శంకర్, సి ఎన్ రఘు ప్రసాద్, అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రవీందర్, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, సైన్స్ డీన్ ఆచార్య ఎం. అరుణ, పాలక మండలి సభ్యులు డా. మారయ్య గౌడ్, గంగాధర్ గౌడ్, బి ఎల్ ఎన్ శాస్త్రి, ప్రొ. నసీం, డా. రవీందర్ రెడ్డి, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తర్వాత సెంట్రల్ గ్రంథాలయాన్ని, బాలికల హాస్టల్, కొత్త బాలుర హాస్టల్, పాత బాలుర హాస్టల్ సందర్శించి హాస్టల్ బోర్డర్స్ తో సంభాషించారు.