డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలి.

\

బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేబోయిన అంజి యాదవ్
అనంతగిరి ,జనంసాక్షి:
మండల పరిధిలోని వెంకట్రాపురం గ్రామ శివారులో కోదాడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేబోయినఅంజి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం గ్రామస్తులతో కలిసి డంపింగ్ యార్డ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ…. వెంకట్రామపురం గ్రామ ప్రజలు డంపింగ్ యార్డ్ తో వ్యాధుల బారిన పడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అధికారులు,నాయకులు చేతులు దులుపుకున్నారని కానీ ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థ వర్ణాతీతం అన్నారు. చెత్తను కాల్చే క్రమంలో వస్తున్నటువంటి బూడిద గ్రామంలో రాత్రి సమయంలో ప్రజలను ఊపిరి మెస్సులకుండా చేస్తుందని, వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలి అనేకమంది ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదని, గ్రామస్తులు కాలు అరిగేలా కార్యాలయాలు చుట్టిన పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని డంపింగ్ యార్డ్ ను వేరే చోటికి తరలించకపోతే భవిష్యత్తులో ఈ గ్రామం కనుమరుగయ్య ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కొలిచలం శ్రీనివాస్, కత్తి మాల వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.