డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు దేశానికే ఆదర్శం

గెలిచాక అన్నింటినీ పూర్తి చేస్తాం: తలసాని
హైదరాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రెండుపడకల ఇళ్ల నిర్మాణాలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఈ పథకం కింద కట్టిన ఇళ్లను చూసి కేంద్ర గృహనిర్మాణ శాఖమంత్రి పూరి సంతృప్తి చెందడంతో పాటు దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం
అమలు చేయాలని సూచించడం మనకు గర్వకారణమన్నారు.  సిఎం కెసిఆర్‌ ఈ విషయంలో ధృఢవైఖరితో ఉన్నారని అన్నారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికన ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నిరుపేదలకు గూడు కల్పించేందుకు తలపెట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే పాలనా పరమైన అనుమతులు జారీ చేసిన ఇళ్లలో బిడ్‌లు దాఖలైన  ఇళ్ల పనులు ప్రారంభించామనిఅన్నారు. పేదలకు రెండు పడకల ఇళ్ల పనులను యుద్ధ ప్రతిపాదికన ప్రారంభిస్తాం అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రెండు పడకల ఇళ్లపై ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంలో సగమైనా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో పనుల్లో కొంత జాప్యం జరిగిందని అన్నారు. ఎన్నికలయ్యాక మళ్లీ పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించి అభివృద్దికి పట్టంకట్టాలన్నారు.