డెడ్‌లైన్‌ ముగిసింది

గోడదూకేందుకు టీ ఎంపీలు సిద్ధం
కార్యకర్తలతో వివేక్‌ భేటీ
హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :
తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానానికి విధించిన డెడ్‌లైన్‌ గురువారంతో ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై 30లోగా తేల్చకుంటే పార్టీ వీడేందుకైనా సిద్ధమని నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, వరంగల్‌ ఎంపీలు మందా జగన్నాథం, డాక్టర్‌ జి. వివేకానంద, సిరిసిల్ల రాజయ్య ఇప్పటికే పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కానీ వారి హెచ్చరికలను కాంగ్రెస్‌ పార్టీ అంతగా పట్టించుకోలేదు. ముగ్గురు ఎంపీలు ప్రత్యేకరాష్ట్ర సాధనే ఎజెండాగా పార్టీ వీడుతామన్నా స్పందించలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చేసిన ప్రకటన అమలు చేయాలని కోరినా వారి మొర ఆలకించలేదు. ఇంతకాలం తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటూ భీరాలు పలికిన తాము ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, అధిష్టానం తరఫున ప్రకటన చేయాలని కోరినా ప్రతిస్పందన లేదు. ముగ్గురు దళిత ఎంపీలు అధిష్టానానికి విసిరిన సవాల్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తద్వారా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దారుణంగా అవమానించింది. ఒక్క అగ్రవర్ణం ఎంపీ పార్టీని వీడితే మాట్లాడిని సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ తెలంగాణ ప్రజల పక్షాన తాము ముగ్గురం పార్టీ వీడుతామన్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని వారు గొంతుచించుకున్నా కనీసం బదులిచ్చేవారే లేకుండాపోయారు. ఈనేపథ్యంలో ముగ్గురు ఎంపీలు మెదక్‌ జిల్లాలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అధినేతతో భేటీ అయ్యారు. విందు రాజకీయాలు నడిపారు. అయినా పార్టీ అధిష్టానంలో చలనం లేదు. వారు విధించిన డెడ్‌లైన్‌ సమీపించినా అధిష్టానం తరుఫున చర్చలు, సంప్రదింపులకు ప్రయత్నించిన వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి.వివేకానంద తన నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ముఖ్య కార్యకర్తలు, నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. టీఆర్‌ఎస్‌లో చేరికపై ఆయన కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉద్యమ పార్టీలో చేరితే తమకు అభ్యంతరం లేదని తాము వెంట వస్తామని కార్యకర్తలు ఆయనకు అండగా నిలిచారు. ఈ భేటీలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌ కూడా పాల్గొన్నారు. జూన్‌ రెండున మంద, రాజయ్యతో కలిసి వివేక్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖరారైంది. వీరి చేరికతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతాయని, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై ఒత్తిడి పెరుగుతందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.