డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీనే?


తొలి మహిళా అభ్యర్థిగా రికార్డు
లాస్‌ఏంజిల్స్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. హిల్లరీ అభ్యర్థిత్వానికి కావాల్సినంత మంది డెలిగేట్స్‌ మద్దతు సాధించేశారని, ఆమెకు 2,383 మంది మద్దతు లభించిందని పేర్కొంది. హిల్లరీ క్లింటన్‌ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవడంతో పాటు డెమోక్రటిక్‌ పార్టీ నుంచి మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన పుర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లోనూ హిల్లరీ క్లింటన్‌ గెలుపొంది డెలిగేట్స్‌ మద్దతు పొందారు.

హిల్లరీ ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌ మాత్రం ఆమెకు అభ్యర్థిత్వం దక్కడాన్ని అంగీకరించడంలేదు. ఇంకా సూపర్‌ డెలిగేట్స్‌ మద్దతు ఇవ్వాల్సి ఉందన్నారు. హిల్లరీకి 1812 మంది డెలిగేట్స్‌ మద్దతు ఉండగా.. శాండర్స్‌కు 1521 మంది డెలిగేట్స్‌ మద్దతు ఇస్తున్నారు. ఇందులో హిల్లరీకి 291 మంది మద్దతు అధికంగా ఉంది. సూపర్‌ డెలిగేట్స్‌ మద్దతు విషయానికొస్తే హిల్లరీకి 571 మంది మద్దతిస్తుండగా, బెర్నీకి 48 మంది మాత్రమే మద్దతిస్తున్నారు. దీంతో హిల్లరీ 523 మంది మద్దతు అధికంగా ఉండడంతో లీడ్‌లో ఉన్నారు. మొత్తం డెలిగేట్స్‌ స్కోరు చూస్తే హిల్లరీకి 2,383 మంది మద్దతు లభించగా, బెర్నీకి 1569 మంది మద్దతు ఉంది.

ఇంకా కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మోంటనా, న్యూమెక్సికో, నార్త్‌డకోటా, సౌత్‌ డకోటా ప్రాంతాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఇప్పటికే బిలియనీర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌కు అభ్యర్థిత్వం ఖరారైపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నుంచి ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ తలపడనున్నారనే విషయం తేలిపోయింది .