ఢల్లీి పార్టీలు వద్దు.. గల్లీ పార్టీలే ముద్దు
` రైతు బాధలు వాళ్లకేం ఎరుక
` నాగలి పట్టిండ్రా.. దుక్కులు దున్నిండ్రా..?
` రైతుబంధు పంచితే పెడబొబ్బులు పెట్టుడేందీ?
` ధరణి పోర్టల్‌తోనే మన భూములు భద్రంగా ఉన్నాయి..
` ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యనే పోరాటం
` ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి
` సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
సత్తుపల్లి/ఇల్లందు, నవంబర్ 1 (జనంసాక్షి):
రైతుల బాధలు కాంగ్రెస్సోళ్లకు తెలియవని, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే రాహుల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్లు నాగలి పట్టలేదు.. సాగు చేయలేదు.. దుక్కులు దున్నలేదన్నారు. రైతుబంధు అందిస్తే ఆ పార్టీ నేతలు పెడబొబ్బులు పెట్టడం చూస్తుంటే అన్నదాతల పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ధరణి పోర్టల్‌తో తెలంగాణ రైతుల భూములు భద్రంగా ఉన్నాయని, గిరిజనులకు పెద్ద ఎత్తున పోడుభూముల పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మాట్లాడారు.
భారతదేశంలో దళితబంధు పుట్టించిందే తెలంగాణ గడ్డ అని, బీఆర్‌ఎస్ సర్కారు చిత్తశుద్ది అని అన్నారు. దళితజాతి బాగు కోసమే ఎంతటి భారమైనా భరించుకుంటూ వెళ్తున్నామన్నారు. దశాబద్దాల తరబడి ఓటు బ్యాంకుగా వాడుకున్నారుగానీ.. వాళ్ల నిజమైన శ్రేయస్సు గురించి ఆలోచించలేదన్నారు. ఉత్తర భారతదేశంలో దళితుల విూద రోజు దాడులే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమా..? అరాచకమా..? అని ప్రశ్నించారు. మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్‌లోకి వచ్చిన తర్వాత ఆదాయం మెరుగుపడ్డాక.. దళితబంధు అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. దళిత ఓట్ల కోసం చిల్లర రాజకీయలు చేసే వాళ్లమైతే.. మొదటి టర్మ్ ఎండిరగ్‌లో, సెకండ్ టర్మ్ ప్రారంభంలో పెట్టేవాళ్లమన్నారు. సత్తుపల్లి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం అని కేసీఆర్ ప్రశంసించారు. ఆలోచన శక్తి ఉన్న ప్రజలు. విూతో ఒకటే మాట మనవి చేస్తున్నా.. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను కూడా చూడాలి. వారి చరిత్ర తెలుసుకోవాలి. వీరిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. వీరి వెనుకాల ఉన్న పార్టీ చరిత్ర, దృక్పథం ప్రజల గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.
ఖమ్మంవాసులు.. ఎపీ రోడ్లను చూడండి
ఇల్లందు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు.. కానీ చేసుకుంటూ పోయామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక ఒక్క ఇల్లందులోనే 48 వేల ఎకరాలకు పట్టాలు అందించామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ వాళ్లు చీకట్లో ఉన్నారు.. మన దగ్గర వెలుగు ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి. డబుల్ రోడ్ వస్తే మనది.. సింగిల్ రోడ్ వస్తే వాళ్లది. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదు. ఎందుకీ వివక్ష.. ఎందుకు వాళ్లపై దాడులు? హుజూరాబాద్‌లో 100శాతం దళితబంధు అమలు చేశాం. ఆరునూరైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది.. బీఆర్‌ఎస్ పార్టీయే. ఖమ్మం జిల్లాకు చెందిన నేత అహంకారంతో మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశాం. తెలంగాణ ఇస్తే ఎలా బతుకుతారని ఏపీ నేతలు మాట్లాడారు. తెలంగాణ కటిక చీకటి అవుతుందని ఆనాటి సీఎం కిరణ్ అన్నారు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.