ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు 


టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణలో సంక్షేమ పాలన
ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యానారయణ
పెద్దపల్లి,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని ఎన్టీఆర్‌ ఆనాడు అన్నారని, కానీ ఇప్పుడు ఆ టీడీపీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ఆర్టీసీ ఛైర్మన్‌, రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. మహా కూటమి కుట్రలను పన్నాగాలను తిప్పికొట్టాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని,ఆంధ్ర పార్టీ టీడీపీతో జతకట్టి చంద్రబాబుకు దాసోహమైందని విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రా సీఎం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నదనీ, ఆ పార్టీ నాయకులను ప్రజలు ఛీ కొడుతున్నారని
మండిపడ్డారు. వారికి ఓటేస్తే ఢిల్లీకి, అమరావతికి బానిసలవ్వాల్సిందేనని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మాయకూటమిని ప్రజలు అంగీకరించడంలేదనీ, అందుకే ఆయా పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్నారని తెలిపారు. గులాబీ కండువాలు కప్పుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఇంకా అనేకమంది టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీనే తెలంగాణ ప్రజల రక్షణ కవచమని స్పష్టం చేశారు.  40ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు చంద్రబాబు ఢిల్లీకి గులాంగిరి చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమే తప్ప సంక్షేమం ఉండదని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ వద్ద టీడీపీ మోకరిల్లిందని, టీడీపీ నేతలు ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారన్నారు. అధికారం కోసం టీడీపీ, నాలుగు సీట్ల కోసం తెలంగాణ జన సమితి సిద్ధాంతాలను వదులుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ నేతలకు పదవులే ముఖ్యమయ్యాయన్న ఆయన అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కేవలం ఐదు సీట్లైన వస్తాయోరావో తెలియని బీజేపీ అధికారంలోకి వస్తామంటుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.  రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ రైతులకు సాగునీరు రాకుండా చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేశారని, అలాంటి వారికి అధికారం వస్తే దోచుకోవటమే తప్ప ప్రజలకు ఇచ్చేది ఏవిూ ఉండదన్నారు.