ఢిల్లీ ట్రాఫిక్‌ సమస్యలపై సుప్రీం సీరియస్‌

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరిగినా ఎందుకు ప్రారంభించలేదు
నేషనల్‌ హైవేస్‌ అథారిటీపై మండిపాటు
న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి):  నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలో వాహనాల రద్దీ, కాలుష్య నియంత్రణ కోసం నిర్మించిన ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే సిద్ధమైనా కూడా ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభమైతే ఢిల్లీపై కాస్త ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. రెండు లక్షల వరకు పెద్దపెద్ద వాహనాలు రాజధానిని బైపాస్‌ చేస్తూ వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని గత ఏప్రిల్‌ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. మరి ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదు.. ప్రధాని కోసం ఎందుకు వేచి చూస్తున్నారు అంటూ జస్టిస్‌ ఎంబీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.  ఢిల్లీ కాలుష్యంపై విచారణలో భాగంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ వే గురించి కోర్టు ఆరా తీసింది. మేఘాలయ హైకోర్టును ఎవరూ అధికారికంగా ప్రారంభించక పోయినా ఐదేళ్ల నుంచి పనిచేస్తూనే ఉంది కదా అంటూ ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఎందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌ వే వేచి చూడాలి అంటూ హైవేస్‌ అథారిటీని నిలదీసింది. అధికారికంగా లేదా అనధికారికంగా.. ఎలా అయినా సరే మే 31లోపు దీనిని ప్రారంభించేల్సిం దేనని ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.. ఇంకా ఏమాత్రం ఆలస్యమైనా అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది అని కోర్టు స్పష్టంచేసింది. ఏప్రిల్‌ 29నే దీనిని ప్రారంభిచాలని అనుకున్నామని, అయితే మోదీ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయామని
ఎన్‌హెచ్‌ఏఐ కోర్టుకు తెలిపింది. మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2006లోనే ఈ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే 2015లో రూ.5763 కోట్ల అంచనాతో దీని నిర్మాణం మొదలైంది. 400 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. దీని పొడువు 135 కిలోవిూటర్లు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో ఈ ఎక్స్‌ప్రెస్‌ వే విస్తరించింది.
——