తట్టెడు మన్ను తీయలేదంటారా?

` రూ.7వేల కోట్ల ఖర్చు, 11 పుంపుల్ని పూర్తిచేశాం
` బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌ శాఖకు ‘చీకటి రోజులు’
` పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు
` కాళేశ్వరం పేరుతో వేల కోట్లు.. ఫలితం శూన్యం
` కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌ ఘోర వైఫల్యం
` మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ మండిపాటు
` మూడేళ్లలో ఎస్‌ఎల్బీసి పూర్తి చేస్తామని హామీ
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్‌, హరీష్‌ రావులు 2021లో ఈ ప్రాజెక్టు పనుల్లో కాలాయపన చేయమని ఆదేశాంచారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రేమతో పాలమూరు రంగారెడ్డి సహా రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల పెండిరగ్‌ ప్రాజెక్టులను పడకేయించారని విమర్శించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పనులు పూర్తి చేశామని కేసీఆర్‌, హరీష్‌ రావు లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హాయంలో రూ.27వేల కోట్లు ఖర్చు చేసి..35శాతం పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. 90శాతం పనులు పూర్తి చేసిన వారైతే ఎందుకు ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని నిలదీశారు.డీపీఆర్‌ 55వేల కోట్లకు సమర్పించారని..భూసేకరణకు కావాల్సిన రూ6వేల కోట్లు, డిస్టిబ్యూటర్‌ చానల్స్‌ నిర్మాణం ఇందుకు అదనమని తెలిపారు. 30వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో ఒక్క డిస్టిబ్యూటరీ కాలువను నిర్మించలేదని, ఎలా సాగునీరు సరాఫరా చేశామని చెప్పుకుంటారని నిలదీశారు. ఫోటోల కోసం ఒక మోటార్‌ ఆన్‌ చేసి వెంటనే బంద్‌ చేశారని, మేం వచ్చాక 11మోటార్లను సిద్దం చేశామని ఉత్తమ్‌ తెలిపారు.పాలమూరు రంగారెడ్డికి కావాల్సిన నీటి కోసం 45టీఎంసీలు కావాలని వారు చెప్పిన చెరువుల మిగులు నీళ్ల లెక్కల మేరకు కేంద్రానికి లేఖ రాశామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. మేం తక్కువ నీళ్లు అడగలేదని, డీపీఆర్‌ అనుమతి కోసం రాసిన లేఖలో 90టీఎంసీలు అని స్పష్టంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో సాంకేతిక, పర్యావరణ సహా ఇతర అనుమతులు ఏవి సాధించకుండానే సాధించామని కేసీఆర్‌, హరీష్‌ రావు లు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కృష్ణాజలాల వినియోగంలో మేం వచ్చాకే అధిక వినియోగం చేశామని ఉత్తమ్‌ వివరించారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.7,000 కోట్లు లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఖర్చు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని రాష్ట్రానికి భారం పెట్టారని, వేల కోట్ల అప్పులు చేసి ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చింది లేదన్నారు.