తడిసి ముద్దయిన గోదావరి జిల్లాలు
ఏలూరు, జూలై 20 : నైఋతి ఋతుపవనాల ప్రభావం బలంగా ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాల తాకిడి శుక్రవారం కూడా కొనసాగింది. పలు చోట్ల విరామం లేకుండా వర్షాలు పడుతుండగా మరికొన్ని చోట్ల ఓ మాదిరి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా భావించే ఉభయగోదావరి జిల్లాల్లో సార్వా నారుమళ్ళకు పుష్కలంగా నీరందే పరిస్థితి కనిపిస్తుంది. విస్తారమైన వర్షాలు ఖరీఫ్ సాగు పనులు ఊపందుకునేలా చేశాయి. అన్నదాతల్లో సంతోషం వెల్లివిరిసింది. సాగుపనులు మరింత జోరందుకున్నాయి. గోదావరికి వరదనీటి తాకిడి పెరిగింది. నది కళకళలాడుతుంది. ధవళేశ్వరం బ్యారేజికి ఉన్న మొత్తం 177 గేట్లలో 70 గేట్లను ఎత్తివేశారు. కొంతమేర వరద నీటిని సముద్రంలోకి వదిలుతున్నారు. పశ్చిమ డెల్టాకు 3,500 క్యూసెక్కుల గోదావరి జలాలను వరి సాగు నిమిత్తం విడుదల చేశారు. కొన్ని చోట్ల భారీగా కురిసిన వర్షాల వలన ఇప్పటికే వేసిన నారుమళ్ళు నీట మునిగాయి. అయినప్పటికి నారుమళ్ళకు వాటిల్లే ప్రమాదమేమీ లేదని, ఉప్పునీటి మిశ్రమాన్ని చల్లితే నారు కుళ్ళిపోకుండా ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దట్టంగా మేఘాలు అలుముకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మధ్య మధ్య కాస్తంత విరామం ఇచ్చినా వర్ష తీవ్రత అధికంగానే ఉంది. జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, కొవ్వూరు పట్టణాలలో ఓ మాదిరి వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో కొండవాగులు పొర్లిపొంగుతున్నాయి. జిల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు ఇంకా వరదనీరు వచ్చి చేరలేదు. బొర్లపై ఆధారపడిన మెట్టప్రాంత రైతులు కురుస్తున్న వర్షాలతో ఎగిరి గంతులేస్తున్నారు. డెల్టా ప్రాంతాల్లోను అన్నదాతల ముఖాలు వెల్లివిరిశాయి. రాజమండ్రిలో బారి వర్షం కురిసింది. కోనసీమలోని పలు ప్రాంతాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. బంగాళాఖాతంలో ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కొస్తా అంతటా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించింది. కొస్తా తీరం వెంబడి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని బులిటెన్ స్పష్టం చేసింది. ఈ సంద్భంగా సముద్రంలోకి చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్ళవద్దని హెచ్చరికలు చేశారు.