తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు…

తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...
 న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే  టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును….ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్ము నష్టపోతామనే భయం లేదు. దాదాపు సగం  సొమ్ము తిరిగి మన ఖాతాలో చేరుతుంది.  ఇప్పటి వరకు తత్కాల్ సేవ ద్వారా బుక్ చేసుకున్న రైల్వే టికెట్ను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు  ఒక్కపైసా కూడా వెనక్కి వచ్చేది కాదు. కానీ ఇక ముందు తత్కాల్ టికెట్  కాన్సిల్ చేసుకుంటే దాదాపు  50 శాతం  డబ్బులు తిరిగి రానున్నాయి.  ఈ మేరకు భారతీయ రైల్వేస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అలాగే తత్కాల్ టికెట్లు బుకింగ్ వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన కొత్త షెడ్యూల్ ప్రకారం  ఏసీ క్లాస్ టికెట్లను  ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు , నాన్ ఏసీ టికెట్లను  ఉదయం 11 -12 గంటల మధ్య  బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ  కల్పిస్తోంది. దీంతో పాటు  బాగా రద్దీ ఉండే కొన్ని రూట్లలో  ప్రత్యేక తత్కాల్  రైళ్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్టు సమాచారం. మరోవైపు  తత్కాల్ స్పెషల్ రైలు  టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 10 రోజుల నుంచి రెండు నెలల లోపు(60 రోజులు) బుక్  చేసుకునే వీలుగా నిబంధనలు సవరించినట్టు సమాచారం.