తత్వరలో విద్యుత్‌ కష్టాలు తీరుతాయి బలహీనవర్గాల సంక్షేమం పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌దే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌, జూలై 13 ద్యుత్‌ సంక్షోభం వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి కరుణించక పోవడంతోను, అధికారుల కొద్దిపాటి అలసత్వం వల్ల విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందన్నారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించే విషయంపై ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. విద్యుత్‌ విషయంపై ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని, తమకు కూడా ఆవేదనగా ఉందని చెప్పారు. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల సంక్షేమం పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. నాడు.. నేడు.. రేపు ఆ వర్గం సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని, విజయవంతంగా అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీవేనని చెప్పారు. ఉప ఎన్నికల అనంతరం భర్త మరణం విషయాన్ని విజయమ్మ మరిచిపోయినట్టున్నారని అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు.. ఇందిరమ్మ బాట కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. పాలనా పరంగా అన్ని వేళల్లోను ఏదొక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆ దిశలో చేపట్టిందే ఇందిరమ్మ బాట అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ముఖ్యమంత్రి, మంత్రులు పరిష్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోవచ్చిందన్నారు. కేవలం 4, 5 స్థానాలకే పరిమితం కావడం ఖాయమన్నారు. బిసిలకు సీట్ల ఇస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ గతంలోను మాట మార్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 76 సీట్లు ఇచ్చిన విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ఎవరూ లేరన్నారు. మరోమారు మాట తప్పరన్న గ్యారంటీ లేదని చెప్పారు.