తప్పిన ప్రమాదం

– భారీ వర్షాలతో ముంబయిలో కూలిన వంతెన
– పలువురికి గాయాలు
– రైళ్ల రాకపోకలకు అంతరాయం
ముంబయి,జులై3(జ‌నంసాక్షి): మంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి రైల్వే స్టేషన్‌లోని పాదచారుల వంతెనలో కొంత భాగం ఉదయం 7.30గంటల ప్రాంతంలో కూలిపోయింది. శిథిలాలన్నీ రైల్వే పట్టాలపై పడటంతో పశ్చిమ రైల్వే సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా వంతెన కూలిన ఘటనలో పలువురు గాయపడినట్లు, వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అంధేరి ఈస్ట్‌, అంధేరి వెస్ట్‌ను కలిపే ఈ వంతెన కూలడంతో రైల్వే స్టేషన్‌లోని ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమైందని, ఇంజినీర్ల బృందం మరమ్మతు చర్యలు చేపట్టిందని పశ్చిమ రైల్వే పీఆర్‌ఓ రవీందర్‌ భాకర్‌ వెల్లడించారు. ఈ ఘటనతో సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. వంతెన కూలడంతో అంధేరీ స్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన, ఇక్కడకి రావాల్సిన రైళ్లు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వంతెన శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30కు వంతెన కూలిందని.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగానే వంతెన కూలిపోయిందని తెలిపారు. వంతెన కూలిన సమయంలో దాని కింద రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. పశ్చిమ రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులకు టిఫిన్‌ బాక్సులు అందించే డబ్బావాలాలు కూడా పశ్చిమ రైల్వే రూట్లలో తమ సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు.
ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..
మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా థానేలో ఓ హౌసింగ్‌ సొసైటీ ప్రహరీ గోడ కూలడంతో 35ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ బీఎంసీ కమిషనర్‌, ముంబయి పోలీస్‌ ఛీఫ్‌లతో మాట్లాడారు. రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్సు సర్వీసులను పెంచాలని ఆదేశించారు. అలాగే కొన్ని లోకల్‌ రైళ్ల రూట్లను పెంచాలని వెల్లడించారు. అంధేరీ స్టేషన్‌ వద్ద ఎస్వీ రోడ్డుపై ఉన్న వంతెన కూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విరార్‌- గోరెగావ్‌, బాంద్రా-చర్చిగేట్‌ల మధ్య రైళ్లు నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అత్యవసరమైతే తప్ప రైలు ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా నగరంలోని శ్యామ్‌ తలావ్‌, హింద్‌మాతా, ఒబెరాయ్‌ మాల్‌, డబ్ల్యుఈహెచ్‌, సీఎస్‌టీ రోడ్‌, కుర్లా, మహిమ్‌ జంక్షన్‌, నెహ్రూ నగర్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఈ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పలు రైళ్లు నిలిచిపోవడంతో అంధేరి, బోరివాలి మధ్య బృహన్‌ ముంబయి ఎలక్టిక్ర్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులను నడుపుతోంది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన పశ్చిమ రైల్వే రూట్లలో డబ్బావాలాలు తమ సేవలను నిలిపేశారు. సెంట్రల్‌ రైల్వే సర్వీసులు కూడా 15 నుంచి 20 నిమిషాలు
ఆలస్యంగా నడిచాయి.