తప్పిపోయిన పిల్లల అప్పగింత
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వివిధ కారణాలతో ఇంటి నుండి తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల చోరవతో వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు.సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన తేజ నాయక్(9) అనే విద్యార్థి స్థానిక గాంధీ నగర్ సమీపంలోని లైలా స్కూళ్లో చదువుతున్నాడు.మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో స్కూల్ నుండి బయటికి వెళ్ళి దారితప్పి ఖమ్మం ప్లైఓవర్ సమీపంలోని ఖమ్మం జంక్షన్ వద్ద తచ్చాడుతుండగా అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు తేజను ప్రశ్నించగా అతడు సరైన సమాధానం చెప్పక పోవడంతో పోలీసులు తేజ ద్వారా అతని తండ్రికి ఫోన్ చేసి పిలిపించారు.ఖమ్మం ప్లైఓవర్ వద్ద తేజని అతని తండ్రికి అప్పగించారు.మరో సంఘటనలో మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 8 ఏళ్ల వయస్సు గల బాబు తప్పి పోయినట్లు గుర్తించిన పోలీసులు అతనిని సూర్యాపేట విద్యానగర్ కు చెందిన హర్షవర్ధన్ రెడ్డిగా గుర్తించారు.తన తల్లిదండ్రుల పేర్లు భవానీ, శ్రీకాంత్ రెడ్డి అని చెప్పడంతో ఫోన్ నెంబర్ తెలుసుకోని వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి ఆ బాబును వారికి అప్పగించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.తప్పి పోయిన ఇద్దరు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించిన సిబ్బందిని ఆయన అభినందించారు.