తప్పు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోండి
తనను పార్టీ నుంచి బహిష్కరించండి
తనకుతానుగా బయటకు వెళ్లలేనని డిఎస్ వెల్లడి
కుమారుడు బిజెపిలో చేరితే తనకేంటి సంబంధం?
ధర్మపురి సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్,సెప్టెంబర్4(జనం సాక్షి): రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ స్వరం పెంచారు. తనపై ఫిర్యాదు చేసినందున చర్య తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. తన నిబద్దతో ఏంటో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానెంతగా శ్రమించానో తెలుసన్నారు. తన కుమారుడు సంజయ్ బెయిల్ పై బయటకు వచ్చాక ఆయన బహిరంగంగా ప్రకటన విడుదల చేశారు. తనను పార్టీ నుంచి
సస్పెండ్ చేయాలని సూచించారు. టిఆర్‌ఎస్ ఎమ్.పి ఆద్వర్యంలో తనను పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని, తాను ఏవిూ తప్పు చేయలేదని ఆయన అన్నారు. తన కుమారుడుపై ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని అన్నారు. తన రెండో కుమారుడు బిజెపిలో చేరడంలో తన ప్రమేయం లేదని అన్నారు. అన్ని కుటుంబాలలోను ఇలాంటి సమస్యలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ ఉద్యమానికి ఎలా సహకరించింది అందరికి తెలుసునని అన్నారు. తెలంగాణ క్యాబినెట్‌లో సగం మంది అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. తనకుతానుగా బయటకు వెళితే ఆరోపణలు అంగీకరించినట్లుగా ఉంటుందని అన్నారు. అందుకే సస్పెండ్ చేయడం ద్వారా బయటకు పంపాలని అన్నారు. ఇదిలావుంటే డిఎస్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారని, ఎన్నికలకు సారధ్యం వహిస్తారన్న ప్రచారం ఢిల్లీలో ఊపందుకుంది. ప్రస్తుత పరిస్తితుల్లో డిఎస్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకుని వచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే ఎంపి కవిత నేతృత్వంలో జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు గతంలో ధర్మపురిపై ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, చర్యలు తీసుకోవాలని కోరారు.