తమిళనాట సంచలన హత్య

కొడుకును హత్య చేసిన సినీ కథారచయిత
కూపీలాగి అరెస్ట్‌ చేసిన పోలీసులు
చెన్నై,మే11(జ‌నం సాక్షి ):  మద్యం, మాదకద్రవాల్యకు బానిసై రోజు ఇంటికొచ్చి డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడిని హత్య చేసిన ప్రముఖ తమిళ రచయిత, పాత్రికేయుడు ‘సౌపా’ అలియాస్‌ సౌందరపాండ్యన్‌
వ్యవహారం కలకలం రేపింది. స్వయంగా ఆయన కొడుకునే హత్య చేయడం తమిళనాట సంచలనం కలిగించింది.  మదురై ఎస్‌.ఎస్‌ కాలనీ పోలీసులు గురువారం ఆయనను అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.. మదురై కోచ్చడై డోక్‌ నగర్‌కు చెందిన సౌందర పాండ్యన్‌, లతా పూర్ణం దంపతులకు విపిన్‌ అనే కుమారుడున్నాడు. ప్రముఖ కథారచయిత అయిన సౌందరపాండ్యన్‌ తమిళనాట జరిగిన భ్రూణహత్యలపై సంచలనాత్మకమైన వ్యాసాలను రాసి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించారు.   ఆయన రచించిన ‘శీవలపేర్‌ పాండి’ నవల తమిళ సినిమాగా రూపొంది సూపర్‌హిట్‌ అయ్యింది. అలాగే కొన్నాళ్ల క్రితం మనస్పర్థల కారణంగా
సౌందరపాండ్యన్‌ను విడిచి లతాపూర్ణం మరో ఇంటిలొ ఉంటున్నారు. వీరి కుమారుడు విపిన్‌ పీజీ దాకా చదివి ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఓ వారం తల్లి ఇంట, మరో వారం తండ్రి ఇంటా ఉంటూ విలాసాలకు డబ్బు కావాలంటూ ఇద్దరినీ వేధించేవాడు. ఈ నేపథ్యంలో రెండువారాలుగా విపిన్‌ జాడ తెలియలేదు. ప్రతి నెలా మొదటివారం తన జీతం రాగానే బల వంతంగా డబ్బులు గుంజుకెళ్లే విపిన్‌ రాకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి అడిగింది. విపిన్‌ తన వద్దకు రాలేదంటూ ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పాడు. దీంతో లతా పూర్ణం మదురై ఎస్‌ఎస్‌ కాలనీ పోలీసులకు కుమారుడు కనిపించడం లేదని, తన భర్తపై అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సౌందరపాండ్యన్‌ను విచారించారు. తొలుత విపిన్‌ తన వద్దకే రాలేదని బుకాయించిన సౌందర పాండ్యన్‌ ఆ తర్వాత మాదకద్రవ్యాలకు బానిసైన కొడుకుని చికిత్సా కేంద్రానికి పంపానని అబద్ధం చెప్పాడు.
పోలీసులు ఆయనను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో కన్నకొడుకు మాదకద్రవ్యాలకు బానిసై డబ్బుల కోసం చేస్తున్న వేధింపులు తాళలేక తానే హత్య చేశానని, కుమారుడి శవాన్ని కొడైరోడ్డులో ఉన్న ఓ తోటలో దహనం చేశానని తెలిపారు. రెండు వారాలకు ముందు విపిన్‌ తన ఇంటికొచ్చి కారు తీసుకెళ్లి మూడు లక్షలకు ఎవరికో అమ్మి ఉడాయించాడని, ఆ తర్వాత ఆ డబ్బుల్ని పూర్తిగా ఖర్చు పెట్టి మళ్లీ విలాసాలకు డబ్బులు కావాలంటూ వేధించడంతో ఇనుపకవ్మిూతో అతడిని కొట్టగా, ఆ దెబ్బలకు మృతి చెందాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వెంటనే శవాన్ని మరో ఇద్దరి సహయంతో తోటవద్దకు తీసుకెళ్లి దహనం చేశానని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. హత్యకు సహకరించిన ఇరువురిని కూడా అరెస్టు చేశారు.