తమిళనాడులో వర్ష బీభత్సం

ఇళ్లు కూలి కోయంబత్తూరులో 15 మంది మృతి

చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కోయంబత్తూరులోని మేటుపాళ్యంలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఇండ్లలో నిద్రిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. మృతులకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై, ట్యుటికోరిన్‌, తిరువల్లూరు, కంచీపురం పరిధిలో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.