తరలింపు మానండి
కడప, జూలై 31: రాయచోటి పట్టణానికి జలధారమైన ప్రాజెక్టు నుంచి మదనపల్లెకు నీటిని తరలిస్తే అడ్డుకుంటామని వైఎస్‌ఆర్ యువజన కాంగ్రెస్ నాయకులు మదనమోహన్‌రెడ్డి హెచ్చరించారు. దశాబ్దాల రాయచోటి పట్టణ ప్రజల మంచినీటి ఎద్దడి ఈ ప్రాజెక్టు వల్ల తీరనుందని చెప్పారు. అలాగే గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామపురం మండలాల్లోని వ్యవసాయ భూములకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. శతాబ్దాల క్షామపీడిత వాతావరణం నుంచి ఈ ప్రాంత రైతాంగాన్ని రక్షించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రాంతానికి ప్రాణాధరమైన ఈ ప్రాజెక్టు నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెప్రజలమంచినీటి అవసరాల కోసం నీటిని తరలించాలని నిర్ణయించడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తే చూస్తు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన ఈ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.