తలవంపులు తెచ్చారు..అందుకే స్పందించా..
మంత్రి దానం నాగేందర్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి): బంజారాహిల్స్-12లోని ఇస్కాన్ టెంపుల్ వద్ద తాను వ్యవహరించిన తీరును కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి దుర్భాషలాడలేదని, నిబంధనల మేరకు దేవాలయాల్లోకి పోలీసులు ప్రవేశించొద్దని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. కృష్ణాష్ఠమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో స్థానికులు శుక్రవారంనాడు నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. తాను పోలీసు అధికారిని దుర్భాషలాడానని అనడం అవాస్తవమన్నారు. ఇతర ప్రార్ధన ఆలయాల్లోకి పోలీసులు ప్రవేశిస్తే సహించబోరని, అలాంటప్పుడు హిందూ దేవాలయాల్లోకి కారణం లేకుండా పోలీసులు ప్రవేశించడాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. ఇస్కాన్ టెంపుల్‌లో జరుగుతున్న అనుచిత కార్యక్రమాల పట్ల తాను సిగ్గుతో తలవంచుకుంటున్నానని, ఇలాంటి తలవంపు పనులు జరగడాన్ని సహించలేక తాను ఆలయం గేటుకు తాళం వేశానని, చెవులను అక్కడే ఉన్న పోలీసు అధికారికి ఇచ్చానని, వాటిని నిర్వాహకులకు అప్పగించాలని కోరానని చెప్పారు. పోలీసు అధికారి తన మాటలు లెక్క చేయకపోవడంతో సస్పెండ్ చేయిస్తానని మాత్రమే హెచ్చరించానే తప్ప ఆయన్ను ఎలాంటి దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. ఇస్కాన్ టెంపుల్ గదుల్లో ఏమి ఉన్నాయో.. చూస్తే తెలుస్తుందని, తాను వెళ్లాక మహిళలను అడిగితే ఆ వివరాలు చెబుతారని, బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా తాను వాటి గురించి చెప్పలేనని అన్నారు. అలాంటి చర్యలను సహించలేక ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. తనపై కేసులు నమోదు చేశారన్న విషయంపై ప్రశ్నించగా కేసులు తనకు కొత్త కాదని, తెలుగుదేశం పార్టీ తనపై ఎన్నో కేసులు పెట్టిందని, ఇలాంటి వాటిని తాను భయపడబోనని చెప్పారు. మీడియా గాని, ప్రభుత్వం గాని ఇస్కాన్ టెంపుల్ వ్యవహారాలపై విచారణ చేయాలన్నారు. ఇక్కడ జరుగుతున్న అశ్లీల కార్యక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ వ్యవహారం మొత్తంపై తాను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి వివరిస్తానని దానం చెప్పారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయంతో పాటు అక్కడ స్థానికులు కూడా కృష్ణాష్ఠమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి దానం నాగేందర్ హాజరవుతారని తెలీడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భారీఎత్తున మొహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామైంది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.