తల్లిపాలే పుట్టిన బిడ్డకు అమృతం.

-జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
 -ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 8(జనంసాక్షి):
అమృతతుల్యమైన తల్లిపాల విలువను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ అన్నారు.సోమవారం బాబు జగ్జీవన్ రామ్ సమావేశ మందిరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 50 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…తల్లి పాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. భవిష్యత్తును నిర్ధేశించే ఆరోగ్యవంతమైన యువత తల్లి పాల ద్వారానే సాధ్యమన్నా రు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
 తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని బిడ్డకు మొదటి టీకా తల్లిపాలేనని, తాగితే బిడ్డకు తాపిస్తే తల్లికి ఎన్నో విధాలైన ప్రయోజనాలు ఉంటాయని కావున ప్రతి ఒక్కరూ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే తాపించాలని బిడ్డకు రెండు సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు తల్లిపాలు ఇవ్వవచ్చునని తెలిపారు.
 గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యంగా తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది ఆశ, ఏఎన్.ఎంలు‌‌ అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని, కాన్పు అయిన అరగంటలోపు తల్లిపాలు బిడ్డకు ఇచ్చేటట్లు ప్రోత్సహించాలని ముర్రుపాలలో బిడ్డకు ఉపయోగపడే అనేక పోషక విలువలు, వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని ఆయన తెలిపారు.అదేవిధంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత నివారణ కొరకు పరీక్షలు చేయించుకోవాలని రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నారు.అనంతరం కలెక్టర్‌ చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. పౌష్టిక ఆహార కిట్లను అందించారు.తొలుత అంగన్‌వాడీలు తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్వతంత్ర భారత వారోత్సవాల వేడుకల రోజువారి కార్యక్రమాలను వారికి వివరించాలని, భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ అధికారిని టి.యూ వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు రాజేశ్వరి, కృష్ణ, అనిల్ ప్రకాష్, మోహన్ బాబు, పత్యా నాయక్, హెల్త్ ఎడ్యుకేటెడ్ శ్రీనివాస్, సిడిపిఓలు వెంకటరమణ, దమయంతి, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.