తాండూరులో మండుటెండలు
తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు
తాండూరు,మే3(జనంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, సుద్ధ గనుల్లో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు.నాగళ్లతో వేసవి దుక్కులు దున్నడం కష్టతరంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఎండల వేడిమి తీవ్రత అధికంగానే ఉంటోందని తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వర్షాలు ప్రారంభమయ్యేవరకు ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతాయని చెప్పారు.నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీలకు చేరుకున్నాయి. నాలుగు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఎండలో తిరిగేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రజలు ముసుగులు,రక్షణగా టోపీలు, టవల్స్ ధరించి ఎండ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వాతావరణం దాదాపు జిల్లా అంతటా ఉంది. తాండూరు పట్టణంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు వరుసగా నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు కావడంతో గమనార్హం. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకూలి చేసుకుని బతికే ఉపాధి కార్మికులు, అడ్డా కూలీల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నాపరాళ్ల గనులున్న తాండూరు పట్టణంలో, పరిస ర మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి.