తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్

akshaya

న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ మేరకు బదులిచ్చారు. ఆగ్రా పర్యటన రద్దు కావడం తనకు నిరాశ కలిగించిందన్నారు.

వాస్తవానికి ఒబామా దంపతుల భారత పర్యటన షెడ్యూల్‌లో మంగళవారం తాజ్ సందర్శన ఉన్నప్పటికీ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సౌదీ వెళ్లాలని ఒబామా నిర్ణయించుకోవడంతో షెడ్యూల్‌ను కుదించారు.  తాజ్‌మహల్‌ను ఇప్పటివరకూ పలువురు దేశాధినేతలు కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. 2010లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తన భార్య కార్లా బ్రూనీ 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సీతో కలసి తాజ్‌ను వీక్షించారు.