తితిదే మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి ఊరట

– రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు
చెన్నై, జూన్‌28(జ‌నం సాక్షి) : అధిక మొత్తంలో రద్దయిన నోట్లు కలిగి ఉన్న కేసులో తితిదే మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డిపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత చెన్నైలోని శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ రూ.99 కోట్ల రద్దయిన నోట్లు, రూ.34 కోట్ల విలువైన రూ.2000 నోట్లు, 127 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆయనపై మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర, మోసం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసింది. మూడు చోట్ల స్వాధీనం చేసుకున్న కొత్త నోట్లకు సంబంధించి మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ నమోదు చేసింది. ఒకే నేరానికి సంబంధించి మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడాన్ని శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. సీబీఐ చర్య.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నట్లు నివేదించారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఒక ఎఫ్‌ఐఆర్‌నే పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.