తిరగబడ్డాం కాబట్టే.. తెలంగాణ వచ్చింది
– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం
– ప్రాజెక్టులను అడ్డుకొనే చంద్రబాబుతో కాంగ్రెసోళ్లొస్తున్నారు
– చంద్రబాబు పాలన తెలంగాణకు అవసరం లేదు
– పట్టు వదిలితే మళ్లీ మనం అడుక్కుపోయినట్లే
– ఓటుతో బాబుకు, కాంగ్రెసోళ్లకు బుద్ది చెప్పండి
– వచ్చే ఐదేళ్లలో అద్భుత తెలంగాణ చూపిస్తా
– కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
కామారెడ్డి, నవంబర్26(జనంసాక్షి): తిరగబడ్డాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం కామారెడ్డిలో ఆయన ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ 58 ఏళ్లలో, టీడీపీ 17 ఏళ్లలో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ప్రజలదేనని.. పార్టీలది కాదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కరెంట్ కోతలు మళ్లీ మొదలౌతాయని, పార్టీలు కాదు.. నాయకులు ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో రాబోయే రెండేళ్లలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీళ్లు ఇస్తామని, ఆ బాధ్యత తనదే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తూనే ఉంటాయి, చాలా జరుగుతాయని, ఇవి రాగానే చాలా జెండాలు, అభ్యర్థులు ముందుకు వస్తారన్నారు. అందరూ చెప్పేవి వినాలని, ఎవరూ చెప్పేది నిజమో చర్చ చేయాలని కేసీఆర్ సూచించారు. ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదని, ప్రజాస్వామ్యంలో నిజమైన స్ఫూర్తి వస్తేనే ప్రజలు కోరుకున్నది జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఆగమాగం ఓటేస్తే సరిపోదని, 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదని, తిరగబడ్డం కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి తెల్లబడ్డం అని, తెలంగాణ ఏర్పడకపోతే కామారెడ్డి జిల్లా అయి ఉండేది కాదన్నారు. త్వరలోనే కామారెడ్డికి సాగునీరు తీసుకువస్తామని, రెండేళ్లలో లక్షాయాభై వేల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు. మెడికల్ కాలేజీ ఇస్తామని, దోమకొండ వద్ద పీజీ సెంటర్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. వ్యవసాయానికి సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారన్నారు. అమాయకంగా ఉంటే ఇంకా అమాయకంగానే ఉంటామని, అందరం చైతన్యవంతులం కావాలని అని కేసీఆర్ ప్రజలను కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ రాదు.. మళ్లీ ఆగమవుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంట్‌తో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఆగమైతది. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి 35లేఖలు రాశారని, అనేక కేసులు వేశారని, ఇలాంటి వారికి ఎట్ల ఓటేస్తారో ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ లెక్కల ప్రకారం దేశంలో తలసరి సగటు విద్యుత్ వినియోగం తెలంగాణలోనే ఎక్కువగా ఉందని తేలిందని, తలసరి సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఏపీలో 24 గంటల కరెంట్ లేదని, పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, రైతులకు వ్యవసాయం కోసం 24 గంటల కరెంట్ ఇచ్చేది ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. టీఆర్‌ఎస్ చేసిన పనులు నిజమైతే ఓటు ద్వారా ప్రజలు చెప్పాలి అని కేసీఆర్ కోరారు.