తిరుపతిలో ఎన్నికల వేడి రాజేసిన టిడిపి

ముందే అభ్యర్థిని ప్రకటించడంతో సర్వత్రా చర్చ

బిజెపి కూడా రంగంలోకి దిగేలా ప్రణాళికలు

తిరుపతి,నవంబర్‌17 (జ‌నంసాక్షి): తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటన వెలువరించలేదు. కానీ విపక్ష టిడిపి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి అక్కడ ఎన్నికల వేడిని రాజేసిందనే చెప్పాలి. అలాగే ముందే ప్రచారంలోకి దూకే అవకావం కల్పించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీమంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు ప్రచారంలో కూడా పరిస్థితులు సులువు కానున్నాయి. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలుపొందిన వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్‌ రావు ఆకస్మిక మృతితో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. 2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న మొట్టమొదటి ఉప ఎన్నిక కావడం, పైగా అధికార వైసీపీ సిట్టింగ్‌ సీటు కావడంతో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి. గతంలో ఎవరైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ప్రత్యర్థి పార్టీలు ఆ స్థానంలో అభ్యర్థిని నిలిపేవారు కాదు. కానీ.. కొన్నాళ్లుగా ఏపీలోనూ ఆ పరిస్థితి మారింది. తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్నఉప ఎన్నికలో పోటీలో ఉంటామని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ స్పష్టం చేయడంతో పాటు, అభ్యర్థిని ముందుగానే టించింది. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. దుబ్బాకలో గెలిచిన ఊపులో ఉప ఎన్నిక తమకు కలిసొస్తుందన్న భావనలో బీజేపీ కూడా అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమైంది.ఎపిలో బలం చాటుకునేందుకు సిద్దపడుతున్న బిజెపి ఇదే అదనుగా తిరుపతిలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది.అయితే.. 2019లో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు, జరగబోతున్న ఉప ఎన్నికకు తేడావుంది. 2019లో జనసేన పార్టీ పొత్తులో భాగంగా అప్పటి మిత్రపక్షమైన బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థికి తిరుపతి ఎంపీ టికెట్‌ను కేటాయించింది. దీంతో.. ఆ స్థానం నుంచి జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరి రావుకు 20,847 ఓట్లు పోలయ్యాయి. ఆ సమయంలో బీజేపీ నుంచి పోటీ చేసినబొమ్మి శ్రీహరి రావుకు 16,001 ఓట్లు పోలయ్యాయి. బిజెపికన్నా బిఎస్పీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పటి బీఎస్పీ మిత్రపక్షమే నేటి బీజేపీ మిత్రపక్షం జనసేన. తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో జనసేన మద్దతుతో బీజేపీ బరిలో నిలవనుంది. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆనాటి ఎన్నికల్లో ఐదో స్థానానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. తిరుపతి ఎంపీ స్థానంలో గెలిచి ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పార్టీగా అవతరించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించి.. నాయకులు, కార్యకర్తలతో సవిూక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సంస్థాగత శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక రేసులో బీజేపీ ప్రధాన పార్టీల కంటే ముందుండటం గమనార్హం. తెలంగాణ పరిస్థితులకు ఎపి పరిస్థితులకు భిన్నమైన వాతావరణం ఉంది.ఏపీలో ఇప్పటివరకూ వైసీపీ, టీడీపీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు పార్టీలను దాటుకుని బీజేపీ ముందుకు రావడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. జనసేనతో పొత్తు తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తున్నది. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకెళ్లాలని బీజేపీ,టిడిపిలు భావిస్తున్నాయి. దీంతో తిరుపతి ఉప ఎన్నిక రానున్న కాలంలో రసవత్తరం కానుంది.