తిరుపతి వెంకన్నకు గద్వాల ఏరువాడ జోడు పంచలు.. తెలంగాణ నుంచి ఏకైక కానుక ఇదే…

ఏరువాడ జోడు పంచలు మగ్గం వేస్తున్న నేతన్నలు

గద్వాల రూరల్ సెప్టెంబరు 25 (జనంసాక్షి):-* గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది.నాటి నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ఇటీవల పూర్తయింది.ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్‌ లేఖను తీసుకొని పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్‌ తిరుపతికి బయలుదేరారు. అక్కడ ఏరువాడ జోడు పంచెలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేశారు.

-వారసత్వంగా సమర్పణ..

శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశపెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీవేంకటేశ్వరునికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వరునికి ఉత్సవాల మొదటిరోజు, విజయ దశమి రోజున ఈ ఏరువాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్‌ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావడం విశేషం.

— ఎనిమిది కోటకొమ్ములు..

ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్‌ కాలనీలో ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక భక్తిశ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఏరువాడ పంచెల తయారీలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, రమేష్‌ పాల్గొన్నారు.

— సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం….

తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 12 ఏళ్లుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నాం. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం.ఈ జోడు పంచెలను మూడు రోజుల క్రితం టీటీడీ అధికారులకు అందజేసినట్లు మహంకాళి కర్ణాకర్, జోడు పంచెల తయారీదారు తెలిపారు..