తిరుమలలో వైభవంగా మహాసంప్రోక్షణ క్రతువు
అష్టబంధన కార్యక్రమంలో రుత్విక్కులు
భారీగా తగ్గిన భక్తుల రాక
తిరుమల,ఆగస్ట్13(జనం సాక్షి ): తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. ఐదు రోజుల పాటు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు జరుగనుంది. రెండవ రోజు మహాసంప్రోక్షణలో భాగంగా సోమవారం అష్టబంధనం సాగుతోంది. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధన తయారీ ఉంటుంది. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుటుపక్కలా అష్టబంధన సమర్పణ చేశారు. ఉప ఆలయాల్లో అష్టబంధన సమర్పణ సాగుతోంది. మహా సంప్రోక్షణలో భాగంగా మొదటి రోజు కళాకర్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభంలోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవ స్థానాలు ఉంటాయని…. ఒక్కో జీవస్థానానికి 4 కళలు చొప్పున మొత్తం 48 కళలను కుంభంలోకి ఆవాహన చేశామని ఋత్వికులు తెలిపారు. ఈ కుంభాలను యాగశాలకు తరలించి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంప్రోక్షణలో రెండోరోజులో భాగంగా నేడు విశేష ¬మాలతో పాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. గర్భాలయంతో పాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. ఈ అష్ట బంధనాన్ని ఎనిమిది రకాల ద్రవ్యాలతో తయారుచేస్తారు. శ్రీవారి సన్నిధిలోని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా, ఉప దేవాలయాలలో ఈ అష్టబంధనాన్ని సమర్పిస్తారు. ఈరోజు 35వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజుల కంటే సోమవారం భక్తుల రద్దీ కొంత పెరిగింది.
ముందస్తు హెచ్చరికలతో తగ్గిన భక్తుల రాక
నిత్యం భక్తజనంతో కిక్కిరిసి ఉండే తిరుమల కొండ వెలవెలబోయింది. మహాసంప్రోక్షణ సందర్భంగా పరిమిత సంఖ్యలోనే స్వామి దర్శనం ఉంటుందని టీటీడీ భారీస్థాయిలో విస్తృత ప్రచారం చేసింది. దీంతో చాలామంది భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో శని, ఆదివారాల్లోనూ భక్తుల రద్దీ కనిపించలేదు. శనివారం అంకురార్పణ సందర్భంగా 50,900 మంది దర్శనం చేసుకునే అవకాశమున్నా కేవలం 33,106 మందే దర్శనం చేసుకోవడం గమనార్హం. ఆదివారం 28,900 మందికి వీలున్నా సాయంత్రం 6 గంటలకు 15,522 మంది దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గింది. ఆదివారం కేవలం రూ.73 లక్షలే లభించింది 2006 కంటే ఈసారి మహాసంప్రోక్షణకు భక్తులు చాలా తక్కువగా ఉన్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. దీంతోపా4టు ఇక్కడి వ్యాపార సముదాయాలు కూడా వెలవెలబోయాయి. తిరుమలలో సుమారు వెయ్యి దుకాణాలు, 800 హాకర్ లైసెన్సులు, అనధికార హాకర్లు, జనతా.. పెద్ద ¬టళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంటుంది. ఈ క్రమంలో భక్తుల రాక తగ్గడంతో వ్యాపారం గణనీయంగా పడిపోయింది. దుకాణాలన్నీ ఖాళీగా మారాయి. పలు దుకాణాలను మూసేశారు. మరో ఐదు రోజులూ ఇదే పరిస్థితి. అలాంటప్పుడు రూ.లక్షల్లో లీజు ఎలా కట్టాలని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో దాదాపు మూడు నెలలు వ్యాపారులు నష్టపోయారు. తర్వాత ఇప్పుడా పరిస్థితి తలెత్తింది. మరోవైపు తిరుమల ఘాట్‌లో దాదాపు వెయ్యి టాక్సీలు భక్తులను తరలిస్తున్నాయి. ప్రస్తుతం భక్తుల్లేక ఇవన్నీ ఆగాయి.వీటిపై ఆధారపడిన వారికీ రాబడి లేకుండాపోయింది.