‘తూర్పు’పోలీస్ బదిలీల్లో రాజకీయ పైరవీలు
కాకినాడ,జూలై 14,:జిల్లా పోలీస్ శాఖలో ఖద్దర్ చొక్కా చెప్పిందే వేదంగా డిఓ(డ్యూటీ ఆర్డర్)లు జరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా పోలీస్ శాఖలో పూర్తిగా ఖద్దర్‌కి పెద్ద పీటను వేస్తూ బదిలీలను చేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు పూర్తయిన పోలీస్ అధికారి, ఐదేళ్లు పూర్తయిన కానిస్టేబుళ్లకు జనరల్ డిఓలను వేస్తూ ఉంటారు. ఈ బదిలీల్లో ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే సిబ్బందిని పట్టణాలు, నగరాల్లోకి మార్పు చేస్తూ ఉంటారు.పట్టణాల్లో ఉన్నవారు వారి సర్వీసు అంతా సిటీలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంగా,పైరవీల కారణంగా ఏజెన్సీలో ఉండే సిబ్బంది అక్కడే ఉండిపోతూ మగ్గిపోతున్నారు.ఎటువంటి ప్రలోబాలకు, పైరవీలకు లొంగకుండా జిల్లా ఎస్పీ బదిలీల కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా, దానికి భిన్నంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది దగ్గర నుండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి సైతం అదే ప్రాంతాల్లో కూతవేటు దూరంలో బదిలీలు జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎంతో పారదర్శకంగా బదిలీలను చేపట్టేవారు.ఎక్కువగా పైరవీలకు ఖద్దర్‌చొక్కా మాటలే శిలా శాసనంగా భావిస్తూ డిఓలు జరిగిపోతున్నాయి. గత పదిహేనేళ్లుగా కాకినాడ నగరంలో కొంత మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండగా మరో కానిస్టేబుల్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పన్నెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడంటే అధికారులు సిబ్బందికి ఎంత మేరకు పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తున్నారన్నది తేట తెల్లమవుతుంది. స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి సస్పెండ్ అయిన మరో కానిస్టేబుల్ కాకినాడ వన్‌టౌన్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వాస్తవానికి సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌ని విఆర్‌లో ఉంచిన అనంతరం అతన్ని నగరాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు గాని, ఏజెన్సీకి గాని బదిలీ చేయడం రివాజు. అయితే దానికి భిన్నంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న కానిస్టేబుళ్లను కాకినాడ నగరంలోని పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయడం పట్ల విమర్శలు అధికమవుతున్నాయి. బదిలీలు జరిగే సమయంలో జిల్లా ఎస్పీకి ఖద్దర్ చొక్కా సిఫార్సులు, సిబ్బంది పైరవీలు వెరసి వారికి కావాల్సిన స్థానాన్నే పొందుతున్నారు. కానిస్టేబుళ్లను బదిలీ చేసే సమయానికి జిల్లా ఎస్పీకి రాష్ట్ర రాజధాని నుండి ఫోనులు వస్తున్నాయంటే అధికారుల బదిలీలకు ఎక్కడి నుంచి ఫోన్లు వస్తాయన్నది ే చెప్పనక్కర్లేదు. కాకినాడ నగరంలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది కానిస్టేబుళ్లు పైరవీలు చేస్తూ కాకినాడలోనే కొనసాగడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో కొంత మంది కానిస్టేబుళ్లు కాకినాడలోనే కొనసాగుతూ కోట్లకు సైతం పడగలు తీశారన్నది వాస్తవం. పోలీస్ శాఖలో బదిలీలు నిర్వహించే సమయంలో ఎటువంటి ప్రలోబాలకు, పైరవీలకు లొంగకుండా పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తే ఏజెన్సీలో ఎప్పటినుండో మగ్గిపోతున్న కానిస్టేబుళ్లు నగరాలను కూడా చూసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.