తెరాసతోనే అభివృద్ధి సాధ్యం
– తెలంగాణను ఆగంచేసేందుకు కూటమి ఏర్పాటు
– ప్రజాకూటమి కుట్రలను ఓటుతో బుద్ది చెప్పండి
– బోధన్ నియోజకవర్గంలో ఎంపీ కవిత ఎన్నికల ప్రచారం
నిజామాబాద్, నవంబర్28(జనంసాక్షి) : నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మళ్లీ తెరాస అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెరాస ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో బోధన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో బుధవారం కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
విూ ఇల్లు విూరే కట్టుకోండి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, జాగాలు ఉన్నవాళ్లు ఇల్లు స్వయంగా విూరే కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.ఐదు లక్షలు ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇల్లు కట్టుకోవడానికి రూ. 70 వేలు మంజూరు చేస్తే అందులో రూ. 20 వేలు లబ్దిదారులు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. బ్యాంకు ద్వారా పొందిన రూ.50వేల రుణం కోసం బ్యాంకు వాళ్ళు దర్వాజలు తీసుకెళ్లిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్ పైసా చెల్లించకుండానే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. దూపల్లిలో మంజూరైన 50డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీలు తమ కుట్రలను అమలు చేసేందుకు కూటమి కట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఏమి పని అని ప్రశ్నించాలన్నారు. ఈ ఎన్నికల్లో వారిని తిరస్కరించడం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.