తెలంగాణకు కేజ్రీవాల్‌ రూ.15కోట్ల సాయం

– రూ. 2కోట్ల సాయం ప్రకటించిన సీఎం మమతబెనర్జీ

దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి):భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో అతలాకుతలమవుతోన్న హైదరాబాద్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ.15కోట్ల అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ‘హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ సంక్షోభ సమయంలో హైదరాబాద్‌ వాసులకు దిల్లీ ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న సహాయక చర్యల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం తరపున రూ.15కోట్లను అందిస్తాం’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.పదికోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

మమతాబెనర్జీ రూ. 2 కోట్ల విరాళం..

గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు చాలామంది పేదలు ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మంగళవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజానీకానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఫోన్లో మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలంగాణా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మమతా బెనర్జీ తెలిపారు.