తెలంగాణకు సాయం చేయండి
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,సెప్టెంబర్ 8(జనంసాక్షి): తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలి. రాష్ట్రంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటి హబ్‌గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటో మొబైల్ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సాప్ట్‌వేర్‌తో సమానంగా ఐటీ, ఆటో మొబైల్, ఇంజినీరింగ్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న దృష్ట్యా భవిష్యత్తులో డ్రైవర్ లేకుండా కార్లు, బస్సులు తిరుగుతాయని తెలిపారు. విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం వైపు ఆటోమొబైల్, ఇంజనీర్ కంపెనీలు చూస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హయత్ ¬టల్లో జరిగిన జడ్‌ఎఫ్ గ్రూప్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ ఇండియా టెక్నికల్ సెంటర్(ఐటీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన జడ్‌ఎఫ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ఒప్పందం పత్రాలను ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, జడ్‌ఎఫ్ గ్రూప్ ఇండియా సీనియర్ మేనేజర్ మమతా చామర్తి మార్చుకున్నారు. నగరంలో నెలకొల్పబోయే జడ్‌ఎఫ్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కంపెనీలో 2020 నాటికి 2,500 ఇంజినీరింగ్ నిపుణులు పనిచేయబోవడం సంతోషకరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలనిమంత్రి కోరారు. కార్ల విడిభాగాల తయారీ కంపెనీ జడ్‌ఎఫ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.