తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ
వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి
తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ
హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి):
ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణను భగ్గుమనేలా చేశాయి. గురు వారం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు మంత్రుల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను తెలంగాణ వాదులు ముట్టడించారు. సమైక్యాంధ్ర లాబీయింగ్‌కు నాయకత్వం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ఇంటిని ఓయూ జేఏసీ విద్యార్థులు, టీఎస్‌వీ నాయకులు ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దాడి చేశారు. నిజామాబాద్‌లో మంత్రి సుదర్శన్‌ రెడ్డి ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులో విధులను బహిష్కరించి కోర్టుల ఎదుట సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లాలో కోర్టుల్లో విధులను న్యాయవాదులు బహిష్కరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టుల వద్ద సోనియాగాంధీ దిష్టి బొమ్మను తెలంగాణన్యాయవాదులు దహనం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమ సెగ ఎక్కువైంది. ఓయూలో విద్యార్థులు భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌ శుక్రవారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.