తెలంగాణపై ఇంకా ఆగని కుట్రలు: రామలింగారెడ్డి
సిద్దిపేట,అక్టోబర్31(జనంసాక్షి): అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తెలంగాణను అణచి వేయడానికి మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని దుబ్బాక టిఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి అన్నారు. మహాకూటమి లక్ష్యం కూడా ఇదేనన్నారు. అందుకే వారు మళ్లీ తెలంగాణలో అధికారం కోసం ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. వివిధ గ్రామాల్లో ప్రచారంలో భాగంగా పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వారు ఇప్పుడు అధికారమిస్తే చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్ అని.. ఓటు అడిగే హక్కు ఆ పార్టీకే ఉందన్నారు. సమైక్య పాలనలో అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి..గత పాలకుల కాలంలో జరిగిన న అభివృద్ధిని గుర్తించాలని ప్రజలకు సూచించారు. మరోసారి టిఆర్‌ఎస్‌కు అధికారమిస్తే మరింత అభివృద్ధి చేయడానికి సిఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు.



